రెండు నెలలపాటు ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ పంచిన ఐపీఎల్ ముగిసింది. చెన్నై జట్టు తమ ఐదో టైటిల్ నెగ్గింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ చివరకు వరకూ పోరాడినా కూడా ఫైనల్‌లో చెన్నైని ఓడించలేకపోయింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్‌లో కొన్ని కాంట్రవర్సీలు కూడా వైరలయ్యాయి. అలాంటి కాంట్రవర్సీలు ఏంటంటే..
ధోనీ అతితెలివి..:ఈ సీజన్ టైటిల్ నెగ్గిన చెన్నైకి తొలి క్వాలిఫైయర్‌లో ఒక సమస్య వచ్చింది. గుజరాత్‌తో జరుగుతున్న ఆ మ్యాచ్‌లో చెన్నై టీం డెత్ బౌలింగ్ స్పెషలిస్ట్ మతీష పతిరాణా 16వ ఓవర్ వేయడానికి అంపైర్లు ఒప్పుకోలేదు. అతను కొంత సేపు మైదానం వీడటంతో.. కాసేపు మైదానంలో ఉన్న తర్వాతనే బౌలింగ్ చేయాలని అంపైర్లు స్పష్టం చేశారు.

చెన్నైకి ఈ సీజన్‌లో డెత్ ఓవర్లలో పతిరాణా చాలా కీలకమైన బౌలర్‌గా మారాడు. అతను కనుక ఆ ఓవర్ వేయకపోతే మరో ఆప్షన్‌ను ధోనీ వెతుక్కోవాల్సి వస్తుంది. దీంతో తెలివితేటలు చూపించిన ధోనీ.. అంపైర్లతో అదే విషయంపై ఆపకుండా ఐదు నిమిషాలు టైం వేస్ట్ చేశాడు. దీంతో స్లో ఓవర్ రేట్ నమోదైనా కూడా.. పతిరాణా బౌలింగ్ చేశాడు.
ఈ మ్యాచ్‌లో చెన్నై 15 పరుగుల తేడాతో నెగ్గింది. ఇదంతా చూసిన కొందరు అభిమానులు ధోనీ తెలివిని మెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం అంపైర్లు ఇలాంటి అతి తెలివిని వెంటనే ఖండించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ఇది ఈ సీజన్‌లో పెద్ద కాంట్రవర్సీగా మారింది.
ఫ్యాన్స్ దాడి..:ఐపీఎల్ హిస్టరీలోనే మరో షాకింగ్ ఘటన సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తుండగా ఆవేష్ ఖాన్ ఒక ఫుల్ టాస్ వేశాడు. అది బ్యాటింగ్ చేస్తున్న అబ్దుల్ సమద్ నడుము కన్నా ఎత్తుగా వచ్చింది. దీన్ని ఆన్ ఫీల్డ్ అంపైర్లు నోబాల్ ఇచ్చారు.
అయితే లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా ఈ నిర్ణయాన్ని రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి బ్యాటర్ నడుము కన్నా ఎత్తుగా వస్తోందని స్పష్టంగా కనిపించింది. అయినా సరే థర్డ్ అంపైర్ ఇది లీగల్ డెలివరీ అన్నాడు. దీంతో అందరూ షాకైపోయారు. ముఖ్యంగా సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అయతే కోపంతో ఊగిపోయారు.
ఈ క్రమంలోనే లక్నో డగౌట్‌పై నట్లు, బోల్టులతో దాడి చేశారు. దీంతో అక్కడ కూర్చొని ఉన్న లక్నో సిబ్బంది మైదానంలోకి పరిగెత్తుకు రావలసి వచ్చింది. అలాగే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్రేరక్ మన్కడ్ వంటి వారిని కూడా ప్రేక్షకులు ఇలా నట్లు, బోల్టులతో కొట్టడంతో అంతా ఆశ్చర్యపోయారు.

కోహ్లీతో ఎందుకు?:ఇక ఈ సీజన్ మొత్తం హాట్ టాపిక్‌గా నిలిచిన మరో కాంట్రవర్సీ.. కోహ్లీ-నవీన్ కాంట్రవర్సీ. ఆర్సీబీ, లక్నో జట్లు రెండోసారి తలపడినప్పుడు ఈ గొడవ జరిగింది. చిన్నస్వామిలో ఆర్సీబీ ఓడిపోయినప్పుడు లక్నో టీం సభ్యులు చాలా అతి చేశారు. ఆ టీం మెంటార్ గంభీర్ కూడా ప్రేక్షకులు సైలెంట్‌గా ఉండాలంటూ నోటిపై వేలుంచి సైగలు చేశాడు.
దీంతో లక్నోలో మళ్లీ ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు కోహ్లీ కూడా రెచ్చిపోయాడు. లక్నో వికెట్ పడితే చాలా ఎగ్రెసివ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. చివర్లో సిరాజ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్ క్రీజులో ఉన్నాడు. అతను మాట తూలడంతో సీన్‌లోకి కోహ్లీ ఎంటర్ అయ్యాడు. వీళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేటప్పుడు నవీన్‌తో కోహ్లీకి మరోసారి గొడవైంది. గంభీర్ కూడా కలుగజేసుకొని దీన్ని మరింత పెద్ద ఇష్యూ చేశాడు. ఆ తర్వాత కూడా నవీన్ తన సోషల్ మీడియాలో కోహ్లీని టార్గెట్ చేస్తూ తెగ పోస్టులు పెట్టడం, ఫ్యాన్స్ అతనిపై మండిపడటం తెలిసిందే. ఇప్పుడప్పుడే ఈ గొడవను ఫ్యాన్స్ మర్చిపోవడం జరగదు.