న్యూఢిల్లీ: సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎట్టకేలకు తన పరాజయాల పరంపరకు పుల్‌స్టాప్ పెట్టింది. శనివారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో జయకేతనాన్ని ఎగురవేసింది. సొంతగడ్డపై వార్నర్ సేనను మట్టికరిపించింది. వరుసగా మూడు పరాజయాల అనంతరం లభించిన విజయం కావడం వల్ల ఫ్యాన్స్ దీన్ని ఎంజాయ్ చేస్తోన్నారు. ఈ గెలుపుతో ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో పాయింట్ల సంఖ్య ఆరుకు పెరిగింది.
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. అనూహ్యంగా భారీ స్కోర్‌ను సాధించింది. నిర్ణీత 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీన్ని ఛేదించడానికి క్రీజ్‌లోకి దిగిన ఢిల్లీ కేపిటల్స్.. చివరి వరకూ పోరాడింది గానీ విజయాన్ని అందుకోలేకపోయింది. 20 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేయగలిగింది.

12 ఓవర్లల్లో 109 పరుగులకు సగం బ్యాటర్లు డగౌట్‌కు చేరిన దశ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ తన స్కోరును 200లకు చేరువగా తీసుకెళ్లగలుగుతుందని ఎవరూ ఊహించివుండరు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్, కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ సింగిల్ డిజిట్‌కు, హ్యారీ బ్రూక్..అసలు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగిన వేళ- 150 పరుగులు చేయడం కూడా కష్టమేనని భావించిన ఫ్యాన్స్‌కు ఐఫీస్ట్ ఇచ్చాడు క్లాసెన్.
లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన క్లాసెన్.. పరుగుల వరద పారించాడు. 27 బంతుల్లో నాలుగు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో తొలి అర్ధసెంచరీని అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అయిదు ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్.. 153 పరుగులు చేశాడు. తాజాగా చేసిన 53 పరుగులు అతని వ్యక్తిగత అత్యధిక స్కోర్. 182.14 స్ట్రైక్ రేట్‌తో అతని బ్యాటింగ్ దూకుడు కొనసాగుతోంది.
నిజానికి- క్లాసెన్ ఐపీఎల్ కేరీర్ ట్రాక్ రికార్డ్ ఏ మాత్రం బాగోలేదు. 2018లో ఈ టోర్నమెంట్‌లో అడుగు పెట్టాడు. తొలి సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు కలిపి అతను చేసిన పరుగులు 57. ఆ తరువాతి ఏడాది మరింత అధ్వాన్నంగా ఆడాడు. మూడు మ్యాచ్‌లల్లో తొమ్మిది పరుగులే చేశాడు. ఆ తరువాత వరుసగా మూడు సీజన్లకు దూరం అయ్యాడు.
దక్షిణాఫ్రికా తరఫున అద్భుతంగా రాణించడంతో ఈ సీజన్‌లో కావ్యా మారన్ కంట్లో పడ్డాడు. 5.20 కోట్ల రూపాయలను పెట్టి అతణ్ని జట్టులోకి తీసుకుంది. క్లాసెన్ విషయంలో ఆమె అంచనాలు తప్పలేదు. ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. 16, 36, 17, 31, 53 పరుగులు చేశాడు. 51.0 బ్యాటింగ్ యావరేజ్‌ను నమోదు చేశాడు. క్లాసెన్ బ్యాటింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మీమ్స్‌తో పండగ చేసుకుంటోన్నారు.