న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆ జట్టు సాధించిన తొలి విజయం ఇదే. తొలి రెండు మ్యాచ్‌లల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓడిన అనంతరం ఈ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో కేప్టెన్ రోహిత్ శర్మ విశ్వరూపాన్ని చూపాడు. కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. జట్టును ముందుండి నడిపించాడు. 45 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 65 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లోకి రావటం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం జట్టులో డబుల్ జోష్ నింపినట్టయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బౌలర్లకు చుక్కలు చూపాడు. తనదైన స్టైల్‌లో షాట్లు ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికే దక్కింది.

అంతకుముందు- తాను ఆడిన రెండు మ్యాచ్‌లల్లో ఓడింది ముంబై ఇండియన్స్. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై బెంగళూరులో, రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ముంబై వాంఖెడే స్టేడియంలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ప్రత్యేకించి- బెంగళూరులో ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ విఫలం కావడంతో బెంగళూరియన్లు అతనిపై ఘాటు విమర్శలు చేశారు. వడా పావ్ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ పరాజయలు, విమర్శలను మరిచిపోయేలా చేశాడు రోహిత్ శర్మ తన ఆటతీరుతో. ఢిల్లీ కేపిటల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో జట్టును గెలుపుబాట పట్టించాడు. అదే సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటములతో సతమతమౌతోంది. వరుసగా రెండో పరాజయాలను మూటగట్టుకుంది. రెండో మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్‌పై కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో, లక్నో సూపర్ జెయింట్స్ చేతుల్లో బెంగళూరులో మట్టికరిచింది.
ఇది- ముంబై ఇండియన్స్ గెలుపోటములకు రిఫ్లెక్ట్ చేసింది. తొలి రెండింట్లో గెలిచిన ముంబై.. మూడో మ్యాచ్‌లో గెలవడం, తొలి మ్యాచ్‌లో గెలిచిన బెంగళూరు- ఆ తరువాతి రెండు మ్యాచ్‌లల్లో ఓడిపోవడం విమర్శలకు తెర తీసినట్టయింది. రాయల్ ఛాలెంజర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. రోహిత్ శర్మను వడా పావ్ అంటూ అవమానించినందుకు ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్.
ఆర్సీబీని ఉద్దేశించిన చేసిన ట్వీట్.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మీరు కర్మను నమ్ముకుంటే- మేము శర్మను నమ్ముకున్నాం అంటూ ఓ స్లైడ్‌ను పోస్ట్ చేసింది ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌పై. ఈ స్లైడ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సింబల్ పులిని పిల్లిగా చూపించింది. ఈ ట్వీట్ తరువాత ఈ రెండు జట్ల అభిమానులు కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకుంటోన్నారు.