న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ కేపిటల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. దీనికి ఎక్కడే గానీ బ్రేకులు పడట్లేదు. నాలుగు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇంకా బోణీ కొట్టనే లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగింట్లోనూ అపజయాలను చవి చూసింది. అపఖ్యాతాని మూటగట్టుకుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిందీ జట్టు. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టాల్సి ఉంది.
మంగళవారం రాత్రి సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది వార్నర్ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 19.4 ఓవర్లల్లో 172 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది. 20 ఓవర్లల్లో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది. రోహిత్ శర్మ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. 45 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 65 పరుగులు చేశాడు.

ఢిల్లీ కేపిటల్స్‌లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. కేప్టెన్ డేవిడ్ వార్నర్-51, అక్షర్ పటేల్-54, మనీష్ పాండే-26 పరుగులు చేశారు. పృథ్వీ షా-15 సహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. యష్ ధుల్-2, రౌమన్ పావెల్-4, లలిత్ యాదవ్-2, అభిషేక్ పోరెల్-1, కుల్‌దీప్ యాదవ్-0, ఎన్రిచ్ నోర్ట్జే-5 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ మినహా క్రీజ్‌లోకి దిగిన బ్యాటర్లందరూ ధాటిగా ఆడారు.. జట్టుకు విజయాన్ని అందించారు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఓటమిపాలైనప్పటికీ- ఆ జట్టు కేప్టెన్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. 600 ఫోర్లు బాదాడు. ఐపీఎల్‌లో ఇదో రికార్డు. ముంబై ఇండియన్స్‌పై మ్యాచ్‌లో 47 బంతుల్లో ఆరు ఫోర్లతో 51 పరుగులు చేశాడు వార్నర్. ఈ ఆరు ఫోర్లతో అతను 600 బౌండరీల మార్క్‌ను దాటేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లల్లో ఇప్పటివరకు అతను కొట్టిన బౌండరీల సంఖ్య 604కు చేరింది. అది ఇక్కడితో ఆగేది కాదు.

మున్ముందు మరిన్ని బౌండరీల వర్షాన్ని కురిపించడం ఖాయం. తన తదుపరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టాల్సి ఉంది ఢిల్లీ కేపిటల్స్‌కు. పరాజయాల బాట పట్టిన నేపథ్యంలో ఈ మ్యాచ్ అటు ఆర్సీబీకి కూడా అత్యంత కీలకమైనదే. తొలి మ్యాచ్‌లో గెలిచిన తరువాత ఆర్సీబీ వరుసగా రెండింట్లో ఓడింది. ఈ మ్యాచ్‌ను గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ఉంది. ఢిల్లీకి ప్రతిష్ఠాత్మకమైనదే. నాలుగు మ్యాచ్‌లు ఆడినా ఇంకా బోణీ కొట్టలేదు ఢిల్లీ.