న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆ జట్టు సాధించిన తొలి విజయం ఇదే. తొలి రెండు మ్యాచ్‌లల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌పై ఓడిన అనంతరం ఈ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో నిలిచింది.
మరోవంక- ఢిల్లీ కేపిటల్స్ పరాజయాలకు మాత్రం బ్రేకులు పడట్లేదు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లోనూ ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. శనివారం తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఢీ కొట్టాల్సి ఉంది. మంగళవారం రాత్రి సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది వార్నర్ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేపిటల్స్ 19.4 ఓవర్లల్లో 172 పరుగులకు ఆలౌట్ అయింది.

ఢిల్లీ కేపిటల్స్‌లో ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. కేప్టెన్ డేవిడ్ వార్నర్-51, అక్షర్ పటేల్-54, మనీష్ పాండే-26 పరుగులు చేశారు. పృథ్వీ షా-15 సహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. యష్ ధుల్-2, రౌమన్ పావెల్-4, లలిత్ యాదవ్-2, అభిషేక్ పోరెల్-1, కుల్‌దీప్ యాదవ్-0, ఎన్రిచ్ నోర్ట్జే-5 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించింది. 20 ఓవర్లల్లో నాలుగు వికెట్లను మాత్రమే కోల్పోయి 173 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ కేప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. సారథిగా జట్టును ముందుండి నడిపించాడు. 45 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 65 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లోకి రావటం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం జట్టులో డబుల్ జోష్ నింపినట్టయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బౌలర్లకు చుక్కలు చూపాడు. తనదైన స్టైల్‌లో షాట్లు ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికే దక్కింది.
ఈ గెలుపు సంతోషాన్ని రోహిత్ శర్మ తన భార్య రితిక సచ్దేతో పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే రితికకు వీడియో కాల్ చేశాడు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడాడు. ఈ వీడియో క్లిప్‌ను ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇది జస్ట్ టీజర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుంది అంటూ కామెంట్ యాడ్ చేసిందీ వీడియోకు.