న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ 2023 సీజన్.. ఢిల్లీ కేపిటల్స్‌కు ఏ మాత్రం అచ్చిరానట్టే కనిపిస్తోంది. అయిదు మ్యాచ్‌లను ఆడినప్పటికీ.. ఇంకా బోణీ కొట్టలేకపోతోందా జట్టు. ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ కూడా యాడ్ కాలేదు. సున్నా పాయింట్లతో అత్యంత అవమానకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది ఢిల్లీ కేపిటల్స్.
మున్ముందు- ప్రత్యర్థి జట్లపై భారీ తేడాతో విజయాలు సాధిస్తే గానీ ఈ టోర్నమెంట్‌లో ముందుకు సాగలేని దుస్థితిని ఎదుర్కొంటోంది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే అన్ని మ్యాచ్‌లను గెలవాల్సిన స్థితిలో పడింది. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మ్యాచ్‌లను ఓడింది.

ఇక తన తదుపరి మ్యాచ్‌లో బలమైన కోల్‌కత నైట్ రైడర్స్‌ను ఢీ కొట్టబోతోంది ఢిల్లీ కేపిటల్స్. గురువారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. సొంతగడ్డపై జరుగుతున్న ఈ మ్యాచ్‌లోనైనా ఢిల్లీ కేపిటల్స్ గెలిచి బోణీ కొట్టాలని ఆశిస్తోన్నారు అభిమానులు.
ఈ మ్యాచ్ కోసం నెట్స్‌లో చెమటోడుస్తోన్న ఢిల్లీ కేపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ప్లేయర్ల కిట్ బ్యాగ్స్ చోరీకి గురయ్యాయి. బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్.. ఇతర విలువైన వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. మొత్తంగా 16 బ్యాట్లు చోరీ అయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ ముగించుకుని ఢిల్లీకి వచ్చిన తరువాత ఈ విషయాన్ని గుర్తించింది టీమ్.
తాము బస చేసిన హోటల్ గదుల్లో ఉంచిన కిట్ బ్యాగుల్లో నుంచి ఆయా వస్తువులన్నీ కనిపించకుండా పోయాయి. టీమ్ కేప్టెన్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ మిఛెల్ మార్ష్, ఫిల్ సాల్ట్, యాష్ ధుల్.. కిట్స్ బ్యాగుల్లో నుంచి వస్తువులు చోరీ అయినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని టీమ్ మేనేజర్- ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీకి తెలియజేశారు. దీనిపై ఫ్రాంఛైజీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు మేరకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేవేష్ కుమార్ మహ్లా తెలిపారు. ఓవర్సీస్ ప్లేయర్లకు చెందిన ఒక్కో బ్యాట్..మన కరెన్సీలో లక్ష రూపాయల పైమాటేనని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.