న్యూఢిల్లీ: ఐపీఎల్ 2023 సీజన్ ఇక ముగింపు దశకు వచ్చింది. ఆదివారం నాటితో లీగ్ దశ ముగియనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు వాంఖెడే స్టేడియంలో ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. చివరి లీగ్‌ను ఈ రెండు జట్లు కూడా తమ హోమ్ పిచ్‌లపై ఆడబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను శనివారం ఆడబోతోంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ సీజన్‌లో వరుస పరాజయాలతో ఢిల్లీ కేపిటల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లల్లో అయిదింట్లో గెలిచింది.

ప్రస్తుతం 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది డేవిడ్ వార్నర్ సేన. తన చివరి లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఇందులో గెలిచినా ఢిల్లీ కేపిటల్స్ ఎలాంటి ఉపయోగం ఉండదు గానీ.. ప్లేఆఫ్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్థానం తారుమారు కాగలదు. 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న ధోనీ సేన ఢిల్లీని కూడా ఓడించగలిగితే 17 పాయింట్లతో సెకెండ్ క్వాలిఫయర్‌గా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
ఓడితే మాత్రం- మిగిలిన జట్ల గెలుపోటములు చెన్నై సూపర్ కింగ్స్ క్వాలిఫయర్ స్థానాన్ని ప్రభావితం చేస్తాయి. భారీ తేడాతో ఢిల్లీని ఓడించగలిగితే మెరుగైన నెట్ రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో తన రెండో స్థానాన్ని పదిలం చేసుకోగలుగుతుంది. ఒకరకంగా ఇది ధోనీ సేనకు గెలిచి తీరాల్సిన మ్యాచే. ఓటమితో లీగ్ దశను ముగించాలనుకోవట్లేదు సీఎస్‌కే.
ఇప్పుడు పలకరించే ఓటమి- ప్లేఆఫ్స్‌పై నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయని భావిస్తోంది. ఢిల్లీ కేపిటల్స్ కూడా ఇదే పట్టుదలతో ఉంది. ఈ ఐపీఎల్ సీజన్‌ను ఘన విజయంతో ముగింపు పలకాలనే ఉద్దేశంతో నెట్స్‌లో శ్రమిస్తోంది. తన చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించిన దూకుడును చెన్నై సూపర్ కింగ్స్‌పైనా ప్రదర్శించేలా గెలుపు వ్యూహాలను రూపొందించుకుంటోంది.

ఈ పరిణామాల మధ్య ఢిల్లీ కేపిటల్స్ కొత్త జెర్సీతో ధోనీ సేనను ఎదుర్కొనబోతోంది. చెన్నైపై చివరి లీగ్ మ్యాచ్‌ను రెయిన్ బో జెర్సీతో ఆడనుంది. దీని ఫస్ట్ లుక్‌ను ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. ఇది డీసీకి అచ్చి వచ్చే జెర్సీ. ఈ జెర్సీతో 2020, 2021, 2022 సీజన్‌లల్లో రెయిన్ బో జెర్సీతో ఆడిన మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించింది.
2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఏకంగా 59 పరుగుల తేడాతో మట్టికరిపించింది. 2021లో ముంబై ఇండియన్స్‌ను నాలుగు వికెట్ల తేడా ఓడించింది. కిందటి సీజన్‌లో కూడా కోల్‌కత నైట్‌రైడర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టింది. ఈ సీజన్‌లో ఈ సంప్రదాయానికి ఇక చెన్నై సూపర్ కింగ్స్ బలి అవుతుందా? లేదా? అనేది తేలాల్సి ఉంది.