కొన్ని రోజుల క్రితం బెంగళూరుతో తలపడేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోయింది. ఈ ఓటమి భారంతో తిరిగి వెళ్తున్న ఆ జట్టుకు ఒక షాకింగ్ వార్త తెలిసింది. టీం కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహా పలువురు ఆటగాళ్లకు సంబంధించిన క్రికెట్ బ్యాట్లు ఇతర సామగ్రిని ఎవరో దొంగిలించారు.
ఈ విషయం తెలిసిన ఢిల్లీ క్యాపిటల్స్ టేం మేనేజ్‌మెంట్ వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ టీం మెంబర్స్‌కు సంబంధించిన వస్తువులను వివిధ వేదికల మధ్య తరలించేందుకు.. ఒక లాజిస్టిక్స్ కంపెనీ సహాయం చేస్తోంది. ఇలా దొంగతనం జరిగిందని తెలియగానే.. ఆ కంపెనీ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించింది. ఈ దొంగిలించిన సొమ్ము విలువ రూ.16 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.

ఈ విషయం బయటకు వచ్చినప్పుడు పెద్ద దుమారమే రేగింది. ఈ దొంగిలించిన వస్తువుల్లో డీసీ కెప్టెన్ డేవిడ్ వార్నర్, అతని సహచర ఆటగాడు మిచెల్ మార్ష్‌కు సంబంధించిన బ్యాట్లతోపాటు యువ ప్లేయర్ యష్ ధుల్ వాడే క్రికెట్ బ్యాట్లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు రికవరీ అయ్యాయట. ఈ విషయాన్ని డేవిడ్ వార్నర్ స్వయంగా చెప్పాడు. తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో దీనికి సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.
ఈ దొంగతనం చేసిన వారిని పోలీసులు పట్టుకున్నారని, అంతా కాకపోయినా చాలా వరకు పోయిన వస్తువులు దొరికాయని వార్నర్ చెప్పాడు. తమకు ఇలా సహాయం చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశాడు. 'వాళ్లు దొంగలను పట్టుకున్నారు. కొన్ని వస్తువులు మిస్ అయినా.. వీటిని పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్' అని వార్నర్ ఒక పోస్టు పెట్టాడు. సాధ్యమైనంత త్వరగా మిగతా వస్తువులు కూడా రికవరీ అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. తాజాగా తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. జట్టులో కొన్ని కీలక మార్పులతో బరిలో దిగిన ఆ జట్టు.. కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో డీసీ సారధి డేవిడ్ వార్నర్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఛేజింగ్‌లో జట్టు బ్యాటింగ్‌ను ముందుండి నడిపించాడు.