ఐపీఎల్‌లో ఐదో ట్రోఫీ నెగ్గిన లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. తన మాజీ టీంమేట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సోమవారం నాడు జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌తో చెన్నై స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు కూడా.
ఈ క్రమంలో తాజాగా రాయుడు గురించి మాట్లాడిన ధోనీ.. అతన్ని ఆకాశానికి ఎత్తేశాడు. మైదానంలో ఎప్పుడు దిగినా రాయుడు నూటికి నూరు శాతం కష్టపడతాడని కొనియాడాడు. అంతేకాదు, అతను ఉండగా తనకు ఎప్పుడు ఫెయిర్ ప్లే అవార్డు రాదంటూ జోకులు కూడా పేల్చాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కూడా చెన్నై ఓడిపోయే స్థితిలో ఉండగా రాయుడు సూపర్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

అతను కేవలం 8 బంతుల్లోనే 18 పరుగులు చేయడంతో చెన్నైకి కావలసిన రన్ రేట్ భారీగా తగ్గింది. ఇక చివర్లో జడేజా అద్భుత ఇన్నింగ్స్‌తో చెన్నై ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాయుడు గురించి మాట్లాడిన ధోనీ.. 'రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. అతను ఎప్పుడు మైదానంలో ఉన్నా తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతాడు' అని చెప్పాడు.
'అతను జట్టులో ఉన్నంత కాలం నాకు ఫెయిర్ ప్లే అవార్డు దక్కదు. అదే సమస్య' అంటూ నవ్వేశాడు ధోనీ. ఐపీఎల్ టైటిల్ నెగ్గిన తర్వాత రాయుడుకు ధోనీ చాలా అరుదైన గౌరవం ఇచ్చాడు. ట్రోఫీ అందుకునేందుకు వెళ్లేప్పుడు తనతో తీసుకెళ్లిన ధోనీ.. తను పక్కన నిలబడి రాయుడినే ట్రోఫీ తీసుకోవాలని కోరాడు. ఈ క్రమంలోనే రాయుడి టీమిండియా కెరీర్ చిన్నదైనా కూడా అతను ఒక అన్‌సంగ్ హీరో అంటూ మెచ్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో రాయుడు దగ్గర ఉన్న ఒక స్పెషల్ స్కిల్‌ను కూడా ఎత్తిచూపించాడీ మాజీ కెప్టెన్. రాయుడు అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్ రెంటినీ ఒకే స్థాయిలో ఆడగల సమర్ధుడని చెప్పాడు. ఇలాంటి స్కిల్ అంత తొందరగా దొరకదని, ఇది చాలా గొప్ప విషయమని అన్నాడు. 'రాయుడు అద్భుతమైన క్రికెటర్. ఎప్పుడూ జట్టుకు ఏదో ఒకటి చేయాలనే అనుకుంటాడు' అని ధోనీ మెచ్చుకున్నాడు.
రాయుడుతో కలిసి తను చాలా కాలంగా ఆడుతున్నానని చెప్పిన కెప్టెన్ కూల్.. 'ఇండియా-ఎ టూర్స్ నుంచి మేం కలిసి ఆడుతున్నాం. తను స్పిన్‌ను, పేస్‌ను సమానంగా ఆడగల సత్తా ఉన్న బ్యాటర్. అది ఒక స్పెషల్ ట్యాలెంట్. తను ఏదో ఒకటి స్పెషల్‌గా చేస్తాడని ఎప్పటి నుంచో అనుకుంటూ వచ్చా. అతని విషయంలో చాలా సంతోషంగా ఉన్నా' అని చెప్పుకొచ్చాడు. 'తను కూడా నాలాగే ఫోన్ ఎక్కువగా వాడడు. తను ఫెంటాస్టిక్ కెరీర్ ఎంజాయ్ చేశాడు. తన తర్వాతి ఫేజ్‌ను కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తాడని ఆశిస్తున్నా' అని పేర్కొన్నాడు.