రెండు నెలలపాటు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్ పంచిన ఐపీఎల్ 2023 ముగిసింది. మళ్లీ వచ్చే ఏడాది ఈ లీగ్ కోసం ఇప్పటి నుంచే కొందరు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసిన చెన్నై జట్టు ట్రోఫీ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి ముగ్గురు విదేశీ ప్లేయర్లను వదిలేయాలని చెన్నై అనుకుంటోందట.
మిచెల్ శాంట్నర్: ఈ కివీస్ ప్లేయర్ తను ఆడిన ప్రతిసారీ ఫర్వాలేదనిపించాడు. కానీ చెన్నై టీంలో మహీష్ తీక్షణకే ఓటేసిన ధోనీ.. శాంట్నర్‌కు పెద్దగా బౌలింగ్ అవకాశాలు కూడా ఇవ్వలేదు. 2019లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు కేవలం 15 మ్యాచులే ఆడాడు. దీనికి కారణం చెన్నై టీం కాంబినేషన్. ఈ క్రమంలోనే అతన్ని వచ్చే సీజన్‌కు ముందు రిలీజ్ చేసేయాలని అనుకుంటోందట.

బెన్ స్టోక్స్: ధోనీ రిటైర్ అయితే చెన్నై జట్టుకు సరైన కెప్టెన్ లేడు కదా అనుకుంటున్న సమయంలో మినీ వేలంలో భారీ ధరకు బెన్‌స్టోక్స్ అమ్ముడుపోయాడు. అయితే ఈ సీజన్‌లో అతను చెన్నై తరఫున పెద్దగా ఆడలేదు. ఆడిన కొన్ని మ్యాచుల్లో కూడా బౌలింగ్ చేయకపోవడంతోపాటు బ్యాటింగ్ కూడా పెద్దగా చేయలేదు. మినీ వేలంలో ఏకంగా రూ.16 కోట్లకు కొన్న ఇతను జట్టుకు అవసరం లేదట. అతన్ని వదిలేయాలని చెన్నై అనుకుంటోందట.
సిసాండ మగాల: కొన్ని రోజుల క్రితం సౌతాఫ్రికా తరఫున చెలరేగిన ఆల్‌రౌండర్ సిసాండ మగాల. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతను చాలా తక్కువ మ్యాచులు ఆడాడు. ఆడిన వాటిలో కూడా పెద్దగా ఫలితం చూపించలేదు. ఈ ఏడాది చెన్నై టీం ట్రోఫీ నెగ్గినా దానిలో మగాల కంట్రిబ్యూషన్ ఏమాత్రం లేదు. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌కు ముందు అతన్ని కూడా విడుదల చేయాలని డిసైడ్ అయిందట.