ముంబై: ఐపీఎల్ 2023లో మరో ఓటమిని మూటగట్టుకుంది. శనివారం సాయంత్రం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. అపజయాలు ముంబై ఇండియన్స్ కొత్తేమీ కాకపోయిన్పటికీ ఓడిన విధానం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. చెన్నైపై మ్యాచ్‌లో ఇద్దరు, ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రాణించారు. నెహాల్ వధేరా 64 పరుగులతో రాణించాడు.
ఆ స్థాయిలో మరే బ్యాటర్ కూడా భారీగా పరుగులు చేయలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్-26, ట్రిస్టన్ స్టబ్స్-20 పరుగులు చేశారంతే. కేప్టెన్ రోహిత్ శర్మ సహా మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ ఫిగర్‌ను కూడా అందుకోలేకపోయారు. బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైన ముంబై ఇండియన్స్.. కనీసం బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో అయినా రాణిస్తుందనుకుంటే- అదీ అంతంతమాత్రమే. ముంబై నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని 17.4 ఓవర్లలోనే కొట్టేశారు చెన్నై బ్యాటర్లు.

ఈ ఓటమి కేప్టెన్ రోహిత్ శర్మను తీవ్ర విమర్శలపాలు చేస్తోంది. బ్యాటర్‌గా రోహిత్ శర్మ మరోసారి డకౌట్ కావడం దీనికి ఒక కారణం కాగా జట్టును కనీసం విజయం వైపయినా నడిపించడంలో విఫలమయ్యాడంటూ మండిపడుతున్నారు అభిమానులు. ఓపెనర్‌గా విఫలమౌతోన్న నేపథ్యంలో వన్ డౌన్‌గా బ్యాటింగ్‌కు దిగినప్పటికీ క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయాడు రోహిత్. మూడే మూడు బంతులను ఎదుర్కొని డకౌట్ అయ్యాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు రోహిత్ చేసిన స్కోర్ 184 పరుగులే. అతని ఫామ్‌పై టీమిండియా మాజీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సూచించాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ శర్మ తనను తాను ఫిట్‌గా ఉంచుకోవాలని, ఒత్తిళ్ల నుంచి బయటపడాలని అన్నారు. దీనికోసం రెస్ట్ తీసుకోక తప్పదనీ తేల్చి చెప్పారు.

రోహిత్ శర్మ వైఫల్యాలపై తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించారు. రోహిత్ శర్మ ఘోరంగా విఫలమౌతున్నాడని, అది జట్టు మొత్తం మీద ప్రభావం చూపుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ మ్యాచ్‌లో ఎదురైతే కష్టమని వ్యాఖ్యానించారు. గత డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియా ఓడిన విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. అది మళ్లీ రిపీట్ కాకూడదని అన్నారు.
రోహిత్ శర్మపై శ్రీకాంత్ సెటైర్లు సంధించారు. అందరూ అతన్ని హిట్ మ్యాన్‌గా పిలుస్తారని, ఐపీఎల్‌లో ఆటతీరును చూస్తోంటే తన పేరును మార్చుకోవాల్సిన సమయం వచ్చినట్టనిపిస్తోందని అన్నారు. రోహిత్ శర్మ తన పేరును నో హిట్ శర్మగా మార్చుకోవాలని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. క్రీజ్‌లో చురుగ్గా కదలలేకపోవడం, ఒత్తిడికి గురి కావడం వంటి కారణాలతో రోహిత్ విఫలమౌతున్నాడని అన్నారు.