చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్ తొలి ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్- మరోసారి ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. ఈ ఘనతను సాధించడం ఇది పదోసారి. 2021 సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన సీఎస్‌కే ఈ నెల 28వ తేదీన ఫైనల్స్ ఆడబోతోంది. ధోనీ సేనను ఢీ కొట్టే జట్టు ఏదనేది ఇంకా తేలాల్సి ఉంది.
మంగళవారం రాత్రి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 1లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది ధోనీ సేన. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేయగా.. గుజరాత్ టైటాన్స్ దాన్ని ఛేదించలేకపోయింది. 157 పరుగులకు కుప్పకూలింది. 15 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది.

ఫైనల్స్ చేరడానికి గుజరాత్ టైటాన్స్‌కు మరో అవకాశం ఉంది. క్వాలిఫయర్ 2లో నెగ్గాల్సి ఉంటుంది. ఇవ్వాళ ఎలిమినేటర్ మ్యాచ్. ఇందులో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ ఢీ కొట్టనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడాల్సి ఉంటుంది గుజరాత్‌కు. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు వెళ్తుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అప్‌సెట్ అయినట్టు కనిపించింది. జట్టుతో అతనికి పొసగట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో రవీంద్ర జడేజా ప్రవర్తన పట్ల పలు అనుమానాలు ఏర్పడ్డాయి. ఓ సీనియర్ ప్లేయర్‌తో జడేజా తీవ్రంగా విభేదిస్తోన్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో ముమ్మరంగా సాగుతోంది. ఆ సీనియర్ ప్లేయర్- ధోనీ అయి ఉండొచ్చని భావిస్తోన్నారు.

ఈ మ్యాచ్ ముగిసిన తరువాత.. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌కు ముందు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ ప్రత్యేకంగా మాట్లాడటం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. తన రెండు చేతులను రవీంద్ర జడేజా భుజాలపై ఉంచి.. ఓదార్చుతున్న స్థితిలో కనిపించారు కాశీ విశ్వనాథన్.
జడేజాను సర్దిచెబుతున్నట్లు, బుజ్జగిస్తోన్నట్లు కనిపించారాయన. జడేజాతో ఏదో మాట్లాడటం, ఆ సమయంలో హ్యాండ్ టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవడం ఈ వీడియోలో కనిపించింది. బుజ్జగింపు తరువాత జడేజాకు కాశీ విశ్వనాథన్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. దాదాపుగా హగ్ చేసుకున్నారు. వెళ్తూ, వెళ్తూ అతని భుజాన్ని తట్టడం కూడా ఈ వీడియోలో రికార్డయింది. దీన్ని బట్టి చూస్తోంటే- రవీంద్ర జడేజా అలిగాడనే విషయం ఇక్కడ స్పష్టమౌతోంది.