చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు మరోసారి తండ్రయ్యాడు. రాయుడు దంపతులకు రెండో బిడ్డ పుట్టింది. తనకు కూతురు పుట్టిన విషయాన్ని రాయుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన మొదటి కుమార్తె, ఇప్పుడు పుట్టిన కుమార్తె కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన ఈ స్టార్ క్రికెటర్.. 'కూతుళ్లు నిజంగా మనకు దక్కే ఆశీర్వాదాలు' అని పోస్టు పెట్టాడు.
ఈ పోస్టును చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీనికి మరో అందమైన క్యాప్షన్ షేర్ చేసింది. 'సూపర్ డ్యాడ్‌కు రెట్టింపు ఆనందం. రాయుడు, అతని కుటుంబానికి శుభాకాంక్షలు' అని పేర్కొంది. దీనిపై చెన్నై ఆటగాడు. రాయుడు టీంమేట్ శివమ్ దూబే స్పందించాడు.

రాయుడును ట్యాగ్ చేసిన దూబే.. 'భయ్యాకు, అతని కుటుంబానికి కంగ్రాచ్యులేషన్స్' అని పోస్టు పెట్టాడు. రాయుడు కాలేజీ రోజుల్లోనే చెన్నుపల్లి విద్య అనే అమ్మాయిని ప్రేమించాడు. వీళ్లిద్దరూ 2009 ప్రేమికుల రోజున పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 2020లో మొదటి కుమార్తె జన్మించింది. ఇప్పుడు మరో కుమార్తె పుట్టింది.
ఇక ఆట ప్రకారం చూసుకుంటే.. రాయుడు ఈ ఏడాది ఐపీఎల్‌లో పెద్దగా రాణించడం లేదు. చెన్నై తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ చేసేందుకు వస్తున్న అతను ఒక్కటంటే ఒక్క కీలక ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఈ ఏడాది 12 మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన అతను.. కేవలం 122 పరుగులే చేశాడు. అతని స్ట్రైక్ రేటు కూడా 127 మాత్రమే ఉండటం గమనార్హం.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై.. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీతో ఆడేందుకు రెడీ అవుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పరువు కోసం ఢిల్లీ పోరాడుతుంది. మరి చివరి గ్రూప్ మ్యాచులో అయినా రాయుడు రాణిస్తాడేమో చూడాలి.