ఐపీఎల్ 2023 ముగిసింది. రెండు నెలలపాటు అత్యద్భుతంగా సాగిన ఈ సీజన్‌కు అదిరిపోయే క్లైమాక్స్ లభించింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తనదైన మార్కు కెప్టెన్సీతో జట్టుకు మరో టైటిల్ అందించాడు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో చెన్నై తన ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.
ధోనీ నాయకత్వంలో చెన్నై జట్టు ఐపీఎల్ ఆరంభం నుంచి బలంగానే కనిపించింది. మధ్యలో రెండు సంవత్సరాలు బ్యాన్‌కు గురైన తర్వాత కూడా చెన్నై తన మార్కు ఆటతో ఐపీఎల్‌పై చెరగని ముద్ర వేసింది. దీనిలో ధోనీ పాత్ర చాలా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సారధ్యంలో సీఎస్కే జట్టు అద్భుతంగా ఆడుతూ 2010, 2011, 2018, 2021, 2023 ఐపీఎల్ టైటిల్స్ నెగ్గింది.

ఈ ఏడాది అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన చెన్నై తమ ఐదో టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయం తర్వాత ధోనీ చాలా ఎమోషనల్‌గా కనిపించాడు. మ్యాచ్ గెలిపించిన జడేజాను గాల్లోకి ఎత్తుకొని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత ఇంటికి బయలు దేరాడు.
ఇలా ఇంటికి వెళ్లేందుకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ధోనీని కొందరు అభిమానులు చూశారు. తమ సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. అంతే, ఎయిర్‌పోర్టు దద్దరిల్లేలా ధోనీ నినాదాలతో రెచ్చిపోయారు. ఇలా వాళ్ల ప్రేమాభిమానాలు చూపించడంతో ధోనీ చాలా సంతోషంగా కనిపించాడు.
కాగా, ఐపీఎల్ ఫైనల్ నెగ్గిన తర్వాత మాట్లాడిన ధోనీ.. తను రిటైర్ అవడానికి ఇదే కరెక్ట్ టైం అన్నాడు. అయితే అభిమానులు తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ఏదో ఒకటి చేయాలని, అందుకే వచ్చే ఏడాది కూడా ఆడాలని అనుకుంటున్నానని చెప్పాడు. దీంతో ధోనీ రిటైర్‌మెంట్‌పై వస్తున్న వార్తలకు కూడా ఫుల్‌స్టాప్ పడినట్లే అయింది.