క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 16వ సీజన్ అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఆయా జట్ల క్రికెటర్లు అందరూ తమ మొదటి మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి ఈ లీగ్ పూర్తిగా జరుగుతుందా? లేక 2020లో జరిగినట్లు మధ్యలోనా ఆగిపోతుందా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణం దేశంలో మరోసారి కరోనా భూతం పంజా విసరడటమే. మనదేశంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
దీంతో ఐపీఎల్ మ్యాచులు అన్నీ జరుగుతాయా? లేక లీగ్ మధ్యలోనే ఆగిపోతుందా? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. 2020లో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ఐపీఎల్ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిస్థితి కొంత చక్కబడింది. అప్పుడు కూడా మన దేశంలో మ్యాచులు నిర్వహించడం కుదరలేదు. యూఏఈలో మిగతా లీగ్ మ్యాచులను నిర్వహించాల్సి వచ్చింది. సరిగ్గా అదే సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలో మరో కరోనా వేరియంట్ దాడి మొదలు పెట్టింది.

ఈ కరోనా కేసుల్లో రోజు రోజుకూ పెరుగుదల కనిపిస్తోంది. ఐపీఎల్ ఆరంభ వేడుకలు, తొలి మ్యాచ్ జరగడానికి ఒక రోజు ముందు మహరాష్ట్రలో సుమారు 700 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా చూసుకుంటే కరోనా కేసుల్లో 50 శాతం పెరుగుదల కనిపించిందని, బుధవారం నాడు కొత్తగా 3 వేలకుపైగా కేసులు వెలుగు చూశాయని గణాంకాలు చెప్తున్నాయి. కరోనా కేసులు కనుక ఇలాగే వేగంగా పెరిగితే ఆ ప్రభావం కచ్చితంగా ఐపీఎల్‌పై పడటం ఖాయమని తెలుస్తోంది.
అదే జరిగితే ఈసారి కూడా ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మళ్లీ ఈ లీగ్ ఎప్పుడు మొదలవుతుంది? ఎక్కడ జరుగుతుంది? అనే విషయంపై పెద్దగా క్లారిటీ లేదు. ప్రస్తుతం కరోనా కేసులు పెరగడాన్ని బీసీసీఐ కానీ, అభిమానులు కానీ అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కానీ కరోనా మహమ్మారి మాత్రం మరోసారి చాప కింద నీరులా దేశంలో వ్యాపిస్తున్న మాట మాత్రం వాస్తవం.