
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో రెండో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్.. చెన్నై సూపర్ కింగ్స్. ముంబై ఇండియన్స్ తరువాత అత్యధికంగా నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ఇది. ఈ సీజన్‌లో తన స్థాయికి తగ్గట్టుగా సత్తా చాటలేకపోయింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. లీగ్ దశలో ఆడిన మొత్తం 14 మ్యాచ్‌లల్లో నాలుగింట్లో మాత్రమే నెగ్గింది. ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టింది.
ఐపీఎల్‌లో ఎక్కువసార్లు టైటిల్‌ను గెలుచుకున్న జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ 10వ స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌తోనే ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్.. టైటిల్‌ను ఎగరేసుకెళ్లింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టి కరిపించింది. ఆడిన తొలి టోర్నమెంట్‌లోనే ఛాంపియన్‌గా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది ఈ హార్దిక్ పాండ్యా టీమ్.
కాగా- చెన్నై సూపర్ కింగ్స్ మరో కొత్త జట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ సారి మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని సీఎస్‌కే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథ్ ధృవీకరించారు. సీఎస్‌కే తరఫున మహిళల జట్టును కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నామని స్పష్టం చేశారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసిన వెంటనే బిడ్డింగ్స్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
నిజానికి- 2021లో మహిళల ఐపీఎల్ టోర్నమెంట్ కోసం బీసీసీఐ సన్నాహాలు చేపట్టినప్పటికీ.. కరోనా వైరస్ పరిస్థితుల వల్ల అది కార్యరూపం దాల్చలేకపోయింది. ఐపీఎల్ మెగా వేలంపాట ఉన్నందున.. ఈ ఏడాది కూడా అది సాధ్యపడలేదు. వచ్చే సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళల ఐపీఎల్ టోర్నమెంట్‌ను తెర మీదికి తీసుకుని రావాలని బీసీసీఐ భావిస్తోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగిసిన వెంటనే ఈ దిశగా చర్యలు తీసుకోవచ్చు.
ఐపీఎల్ టోర్నమెంట్ మీద చెన్నై సూపర్ కింగ్స్ తనదైన ముద్ర వేసిందని కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ సీజన్‌లో జట్టు నిరాశపరిచినప్పటికీ.. మళ్లీ పుంజుకోగలదని చెప్పారు. వచ్చే సీజన్‌లో జట్టు మళ్లీ గాడినపడుతుందని, పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని వ్యాఖ్యానించారు. మహిళల జట్టును కూడా అంతే దుర్భేద్యంగా తీర్చిదిద్దుతామని, బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తరువాత జట్టు కూర్పుపై దృష్టి సారిస్తామని కాశీ విశ్వనాథ్ పేర్కొన్నారు.