
రషీద్ ఖాన్ ప్లేస్‌ను..
గత నాలుగు, ఐదు సీజన్లుగా ఇండియా స్టార్ ఆటగాళ్లు లేక విదేశీ ప్లేయర్లపై పూర్తిగా ఆధారపడిన హైదరాబాద్.. ఈ సారి ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవాలని భావిస్తుంది. ఫారినర్స్‌తో పాటు దేశీయ ఆటగాళ్లను తీసుకోవాలని యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్, అంబటి రాయుడు, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లను టార్గెట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. స్పిన్ కోటాలో సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకోవాలనుకుంటుంది.
భారీ కాంట్రాక్ట్‌ను ఆశించిన అఫ్గాన్ స్పిన్ సెన్సేషన్ రషీద్ ఖాన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. దాంతో అతని ప్లేస్‌ను యుజ్వేంద్ర చాహల్‌తో భర్తీ చేయాలనుకుంటుంది.

ఆర్సీబీ వదులుకోవడంతో..
గత సీజన్ వరకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి ఆడిన యుజ్వేంద్ర చాహల్ రూ. 6 కోట్ల వేతనం అందుకున్నాడు. అయితే రిటెన్షన్ రూల్స్, టీమ్ పర్స్ వాల్యూ నేపథ్యంలో చాహల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేకపోయింది. దాంతో అతను రూ. 2 కోట్ల కనీస ధరకు వేలంలో అందుబాటులో ఉన్నాడు. వేలంలో తక్కువ ధరకు లభిస్తే తీసుకోవాలని ఆ జట్టు భావిస్తోంది.
ఇటీవల ఫామ్‌లో లేకపోయినా చాహల్‌కు పొట్టి ఫార్మాట్లో మంచి రికార్డు ఉంది. ఈ క్రమంలోనే ఫ్రాంచైజీలు అతని కోసం పోటీపడే చాన్స్ ఉంది. సన్‌రైజర్స్ సైతం దేశీయ స్టార్లు తీసుకోవాలనే ఆలోచనతోనే చాహల్‌ను టార్గెట్‌గా పెట్టుకుంది.

రూ.10 కోట్లు పక్కా..
కీలక సమయాల్లో వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పే చాహల్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. వేలంలోకి వదిలేసిన ఆర్సీబీతో పాటు ముంబై ఇండియన్స్, లక్నో, అహ్మదాబాద్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ చాహల్ కోసం పోటీపడనున్నాయి. ఈ క్రమంలోనే అతను రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు పలికే చాన్స్ ఉంది.
చాహల్‌కు ఉన్న డిమాండ్ ప్రకారం అతను కచ్చితంగా రూ.10 కోట్లు పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాహల్‌కు 10 కోట్లు చెల్లించేందుకైనా సన్‌రైజర్స్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు మించిన ధర పలికితే మాత్రం ఆరెంజ్ ఆర్మీ లైట్ తీసుకునే అవకాశం ఉంది.

ముంబైతో మొదలు..
2011లోనే రూ.10 లక్షల కనీసధరకు ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన చాహల్ రెండేళ్ల తర్వాత 2013లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఆ సీజన్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన చాహల్.. 2014లో 14 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీసాడు. ఇక 2015లో రూ.10 లక్షల కనీస ధరకే ఆర్సీబీ చాహల్‌ను తీసుకోగా ఆ సీజన్లో 23 వికెట్లు, 2016లో 21 వికెట్లతో సత్తా చాటాడు.
2018 మెగా వేలంలో ఆర్సీబీ మళ్లీ అతన్ని రూ.6 కోట్లకు కొనుగోలు చేయగా.. గత సీజన్ వరకు అదే జీతాన్ని అందుకున్నాడు. ఓవరాల్‌గా 114 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 139 వికెట్లు తీశాడు. ఇందులో రెండు సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు.