
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్లో దూకుడు బ్యాటర్‌గా పేరొందాడు. టెస్ట్ అయినా, వన్డే అయినా సెహ్వాగ్ బ్యాటింగ్ దూకుడు మాత్రం ఒకేలా ఉండేది. తన బ్యాటింగ్‌తో ఓపెనర్ రోల్ ఇలా ఉండాలి అనేలా చేశాడు. మేటి అంతర్జాతీయ బౌలర్లపై ఎటాకింగ్ గేమ్ ఆడుతూ.. వరుసగా బౌండరీలు బాదేవాడు. ఇక సెహ్వాగ్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి టీమిండియా ప్లేయర్ కూడా సెహ్వాగే. టెస్ట్‌ల్లో రెండు ట్రిపుల్ సెంచరీలతో పాటు వన్డేల్లో ఒక డబుల్ సెంచరీ కూడా సెహ్వాగ్ సాధించాడు.
ఇకపోతే సెహ్వాగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలినాళ్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడాడు. ఇక 2011ఎడిషన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లసిత్ మలింగ బౌలింగ్లో సెహ్వాగ్ దూకుడు కనబర్చకుండా ఆ ఓవర్లో ఒక్క పరుగు తీయలేదు. దీంతో ఆ ఓవర్ మెయిడెన్ అయింది. దీంతో అప్పట్లో అదో పెద్ద చర్చనీయాంశమైంది. ఏంటీ సెహ్వాగ్ మెయిడిన్ ఓవర్ ఆడాడా...? అంటూ అభిమానులు నోరెళ్లబట్టారు. హిట్టింగ్‌కు మారుపేరైనా సెహ్వాగ్ మెయిడిన్ ఓవర్ ఆడడంతో చాలా మంది క్రికెట్ అభిమానులు విస్తుపోయారు. ఇక అప్పట్లో ఈ మ్యాచ్ తర్వాత తన కెరీర్లో పదేళ్ల తర్వాత ఓ ఓవర్ మెయిడిన్ చేశానని సెహ్వాగ్ చెప్పుకొన్నాడు. ఇక ఈ విషయం గురించి తాజాగా క్రిక్‌బజ్‌లో సంభాషణ సందర్భంగా సెహ్వాగ్ ప్రస్తావించాడు.
'నేను ఐపీఎల్‌లో మెయిడిన్ ఓవర్ ఆడాను. దీంతో ఆ మ్యాచ్ అనంతరం నాకు లెక్కలేనన్ని మెసేజ్‌లు వచ్చాయి. భూమిపై ఇలాంటిది కూడా జరుగుతుందా.. సెహ్వాగ్ మెయిడిన్ ఆడతాడా.. అది కూడా టీ20 క్రికెట్‌లో' అంటూ బోలెడన్ని మెస్సేజ్‌లు వచ్చాయని సెహ్వాగ్ తెలిపాడు. 'ఆ మ్యాచ్‌లో నేను మలింగ బౌలింగ్లో మెయిడిన్ ఆడాను. అప్పటికే మలింగ రెండు వికెట్లు తీసుకుని భీకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. అది పవర్‌ప్లేలో చివరి ఓవర్. ఇక నేను స్ట్రయిక్‌లో లేకుంటే మలింగ మరో వికెట్ తీస్తాడనిపించింది. అందుకే ఎలాగోలా ఈ ఓవర్లో రన్స్ రాకున్నా పర్లేదు కానీ నేనే క్రీజులో ఉండాలి అనుకున్నాను. అందుకే నేను మెయిడిన్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. దీంతో ఈ మ్యాచ్ ముగిశాక సెహ్వాగ్ నువ్వు కూడా మెయిడెన్ ఓవర్ ఆడతావా అని స్నేహితులు, మీడియా వాళ్లు నాకు అప్పట్లో బోలెడు సందేశాలు పంపడం నాకు ఇంకా గుర్తుంది అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.