
బెంగళూరు: ఐపీఎల్ మెగా వేలానికి సరిగ్గా ఒక్క రోజు ముందు భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్ ముగిసింది. దీంతో ఈ సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లు ప్రస్తుతం మెగా వేలంలో క్రేజీగా మారిపోయారు. అటు ప్రాంచైజీలన్నీ కూడా భారత్, విండీస్ వన్డే సిరీస్‌లో రాణించిన ఇరు జట్ల ఆటగాళ్లపై ఓ కన్నేశాయి. దీంతో వన్డే సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లకు వేలంలో భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలా మెగా వేలానికి ఒక్క రోజు ముందు ప్రాంచైజీల దృష్టిని ఆకర్శించిన ఆటగాళ్లలో టీమిండియా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ మొదటి స్థానంలో ఉన్నాడు. వన్డే సిరీస్ మొత్తంలో ప్రసిద్ధ్ కృష్ణ ఆకట్టుకున్నాడు. కీలక వికెట్లు తీయడంతోపాటు పొదుపుగా బౌలింగ్ చేశాడు. తొలి వన్డేలో రెండు, రెండో వన్డేలో 4, మూడో వన్డేలో 3 వికెట్లతో మొత్తం 9 వికెట్లును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కూడా ఎంపికయ్యాడు.
దీంతో మెగా వేలంలో కోటి రూపాయల బేస్ ప్రైజ్‌తో ఉన్న ప్రదీప్ కృష్ణపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ కోసం వేలంలో ఫ్రాంచైజీలన్నీ పోటీ పడడం ఖాయమని వారు అంచనా వేస్తున్నారు. అలాగే వేలంలో ప్రదీప్ 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతాడని అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ధ్‌తోపాటు భారత్, వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రాణించిన యజుర్వేంద్ర చాహల్, దీపక్ హుడా, దీపక్ చాహర్, వాషింగ్టన్ సందర్ వంటి ఆటగాళ్లు వేలంలో భారీ ధర పలుకుతారని క్రికెట్ విశ్లేషకలు జోస్యం చెబుతున్నారు. ముఖ్యంగా చాహల్ సిరీస్‌లో ఆడిన తొలి రెండు వన్డేల్లో అదరగొట్టాడు. దీంతో వేలంలో చాహల్ కోసం జట్లన్నీ పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.
భారత ఆటగాళ్లతోపాటు వన్డే సిరీస్‌లో రాణించిన వెస్టిండీస్ ఆటగాళ్లు కూడా మెగా వేలంలో క్రీజీగా మారారు. ఇలా క్రేజీగా మారిన వారిలో జేసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, అల్జారీ జోసెఫ్ ముందు వరుసలో ఉన్నారు. సిరీస్‌లో హోల్డర్ వికెట్లతో అదరగొట్టాడు. తొలి వన్డేలో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అటు ఓడియన్ స్మిత్ కూడా సిరీస్‌లో బ్యాటుతో, బాల్‌తో రాణించాడు. అలాగే అల్జారీ జోసెఫ్ సైతం బౌలింగ్‌లో సత్తా చాటాడు.