
బెంగళూరు: ఐపీఎల్ 2022 ప్రారంభమవడానికి మరో 10 రోజులకు మించి సమయం లేదు. దీంతో జట్లన్నీ మెగా లీగ్ కోసం సిద్ధమవుతున్నాయి. అలాగే ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లందరికీ బీసీసీఐ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో స్పెషల్ క్యాంపు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్యాంపులో ఆటగాళ్లంతా తమ ఫిట్‌నెస్ మెరుగుపరచుకున్నారు. అలాగే ఎన్సీఏ నిర్వహించిన ఫిట్‌నెస్‌కు సంబంధించిన యోయో టెస్ట్‌లో పలువురు ఆటగాళ్లు ఉత్తీర్ణులుగా నిలిచారు.
ఈ యోయో టెస్ట్ పాసైన వారిలో షాబాజ్ అహ్మద్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు. యోయో టెస్టులో పాస్ కావడంతో ప్రస్తుతం వీరంతా తమ తమ జట్లల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా యోయో టెస్టులో పాస్ కావాలంటే 19.5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది.
కాగా ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. షాబాజ్ అహ్మద్, నవదీప్ సైనీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నాడు. శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు.
ఇక ఐపీఎల్ 2022 ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గత ఏడాది ఫైనల్ చేరిన చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. 2 నెలలపాటు జరగనున్న ఈ లీగ్ మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. లీగ్ స్టేజ్‌లో 70 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్లేఆఫ్స్‌లో 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇలా మొత్తం ఈ సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఐపీఎల్ 2022 ముంబైలోని 4 మైదానాల్లో జరగనుంది. ఐపీఎల్ 2022ను వీక్షించడానికి 25 శాతం ప్రేక్షకులను అనుమతించనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది. కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో మ్యాచ్‌లు ప్రారంభమయ్యే నాటికి ఈ సంఖ్యను బీసీసీఐ మరింత పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌కు బీసీసీఐ 100 శాతం ప్రేక్షకులను అనుమతించింది.