
మే 6న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఎడమ ముంజేయి కండరాల గాయమైంది. ఈ గాయం వల్ల తాజాగా జరుగుతున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్‌లో జట్టుకు దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఇక మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఐపీఎల్ మీడియా అడ్వైసరీ ప్రకటించింది. అయితే ముంబై జట్టు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ పూర్తిగా దూరం కావడంతో అతని స్థానంలో ఎవరినైనా తీసుకోవాలా వద్దా అనే విషయమై ఇంకా ముంబై నుంచి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. తాజాగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ స్థానంలో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రమన్‌దీప్ సింగ్‌ను తీసుకున్నట్లు వెల్లడించాడు.
ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ.. ముంబై జట్టులో పోరాట యోధుడిగా సూర్యకుమార్ యాదవ్ దాదాపు అన్ని మ్యాచ్‌లలో పోరాట పటిమ కనబరిచాడు. ఇక సూర్యకుమార్ ఎనిమిది మ్యాచ్‌లలో 43.29సగటుతో 303పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ప్రస్తుతం సూర్య కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ప్రారంభంలో రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్నాక తిరిగి జట్టులో చేరి రాణించిన సూర్య తాజాగా మరోసారి గాయపడడంతో పూర్తి ఐపీఎల్‌కు దూరం కానున్నాడు. ఇక సూర్య రెండోసారి భారీగా గాయపడ్డట్లు తెలుస్తోంది. అతని గాయం తీవ్రత మేరకు.. రెండు మూడు వారాల విశ్రాంతి అవసరమని ప్రాథమిక సమాచారం.
ఇకపోతే ఐపీఎల్-2022 సీజన్‌లో వరుసగా 8 పరాజయాలు చవిచూసిన ముంబై జట్టు ఇక గత రెండు మ్యాచ్‌ల్లో వరుసగా గెలిచి విజయాల బాట పట్టింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది. ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ ఇప్పటికే అప్రదిష్ట మూటగట్టుకోగా.. ఈ క్రమంలో మిగిలిన మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి గౌరవప్రదంగా టోర్నీని ముంగించాలని ముంబై యోచిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌లలో 2 మ్యాచ్‌లు గెలిచి 4పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.