
బెంగళూరు స్ఫూర్తిగా.. బెంగళూరుపైనే
ఇదివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నా.. దాన్నుంచి బయటపడగలిగింది. వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఓటమి తరువాత చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయాన్ని అందుకుని, మళ్లీ రేసులో నిలిచింది. ఇప్పుడీ అవకాశం సన్‌రైజర్స్‌కు చేతికి అందింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటుందా? లేదా అనేది ఈ సాయంత్రానికి స్పష్టమౌతుంది. ఇది కాకుండా ఇంకో మూడు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది సన్‌రైజర్స్‌కు. కోల్‌కత నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లు మిగిలివున్నాయి.

రాయల్ ఛాలెంజర్స్‌తో రెండో మ్యాచ్..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్- రాయల్ ఛాలెంజర్స్ మధ్య పోరు ఇది రెండోసారి. ఫస్ట్ హాఫ్‌లో తన ఏడో మ్యాచ్‌లో ఈ జట్టును మట్టి కరిపించింది ఆరెంజ్ ఆర్మీ. చిత్తుగా ఓడించింది. 68 పరుగులకే బెంగళూరు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఆ లక్ష్యాన్ని ఎనిమిది ఓవర్లల్లో ఒక్క వికెట్ నష్టానికి ఛేదించింది. సెకెండ్ హాఫ్‌లో మరోసారి తలపడబోతోంది. ఇప్పుడా పరిస్థితి లేదు. వరుసగా మూడు ఓటములతో తరువాత సన్‌రైజర్స్ ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిస్తే- ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోగలుగుతుంది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది.

వాషింగ్టన్ సుందర్ ఆడే ఛాన్స్..
ఇవ్వాళ్టి మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉంది. రెండోసారి గాయ పడటం వల్ల జట్టుకు దూరం అయ్యాడీ ఆల్‌రౌండర్. ప్రస్తుతం కోలుకున్నాడు. నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో కనిపించాడు. రాయల్ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉంటాడని హెడ్ కోచ్ టామ్ మూడీ సైతం ధృవీకరించారు. సీన్ అబాట్ స్థానంలో సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్ కూడా గాయపడ్డాడు. ఇవ్వాళ్టి మ్యాచ్‌లో అతను అందుబాటులో ఉండట్లేదు. ఈ స్థానాన్ని కార్తీక్ త్యాగి భర్తీ చేశాడు.

పెద్దగా మార్పుల్లేనట్టే..
ఇదొక్కటి తప్ప సన్‌రైజర్స్ తుదిజట్టులో పెద్దగా మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు. బౌలర్లు మాత్రం విజృంభించాల్సి ఉంది. సెకెండ్ హాఫ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్.. భారీ స్కోర్ మ్యాచ్‌లు. గుజరాత్ టైటాన్స్‌పై 195 పరుగుల టార్గెట్ కూడా నిలవలేదు. అంత భారీ స్కోర్‌ను కాపాడుకోవడంలో బౌలర్లు విఫలం అయ్యారు. అయిదు వికెట్ల నష్టానికే 199 పరుగులు చేసింది గుజరాత్. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు 200లకు పైగా స్కోర్ చేశాయంటే- సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బౌలర్లు గాడిన పడితే గానీ సన్‌రైజర్స్‌కు విజయాలు దక్కవనేది స్పష్టమౌతోంది.

కేన్ మామ ఏం చేస్తాడో..
కేన్ విలియమ్సన్ వ్యక్తిగతంగా భారీ స్కోర్ చేయట్టేదు. ఇప్పటి వరకు ఒక్క హాఫ్ సెంచరీ, మరోసారి 48. ముందున్నవన్నీ కీలక మ్యాచ్‌లే కావడం వల్ల కేన్ ఇక బ్యాటింగ్ ఝుళిపించాల్సిన అవసరం ఉంది. అభిషేక్ శర్మ నిలకడ కోల్పోయాడు. ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠీదీ దాదాపు అదే పరిస్థితి. నికొలస్ పూరన్ ఒక్కడే బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు గానీ.. జట్టును గెలిపించలేకపోతున్నాడు. భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగీ, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ పదును పెంచాల్సి ఉంటుంది.

రాయల్ ఛాలెంజర్స్‌కూ గెలుపు అవసరమే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకూ గెలుపు అవసరమే. చివరి అయిదు మ్యాచ్‌లల్లో రెండింట్లో నెగ్గింది. వరుసగా మూడు ఓటములను చవి చూసింది. కీలక సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. ప్రస్తుతం 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ పక్కన పెడితే- ఆ జట్టు ఆడాల్సింది రెండే. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడింట్లో రెండు నెగ్గినా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

తుదిజట్లల్లో..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో- కేన్ విలియమ్సన్ (కేప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్, నికొలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్/సీన్ అబాట్, భువనేశ్వర్ కుమార్, మార్కో జెన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, కార్తీక్ త్యాగి ఆడే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో- ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లొమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












