
బ్యాటింగ్ ఘోరం..
తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ-43 టాప్ స్కోరర్. రాహుల్ త్రిపాఠి-20, ఎయిడెన్ మార్క్రమ్-21, నికొలస్ పూరన్-5 నిరాశపరిచారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్-25, రొమారియో షెప్పర్డ్-26 సో..సో అనిపించుకున్నారు. మరో ఓపెనర్ ప్రియం గర్గ్ నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 47 పరుగుల భాగస్వామ్యం ఒక్కటే ఇన్నింగ్‌ను కాస్తయినా నిలిపింది.

పంజాబ్ బౌలింగ్ పదును
పంజాబ్ బౌలింగ్‌కు సన్‌రైజర్స్ కుదేల్ అయింది. నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌ను ఆడలేకపోయింది. ఈ ఇద్దరూ మూడేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. కగిసొ రబడకు ఒక వికెట్ దక్కింది. లియామ్ లివింగ్‌స్టొన్, అర్ష్‌దీప్ సింగ్ వికెట్లు పడగొట్టలేకపోయినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశారు. 25 చొప్పున పరుగులు ఇచ్చారు.

బౌలింగ్‌లో ఫెయిల్యూర్
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ 15.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇంకో 50 పరుగులైనా అలవోకగా చేసేలా కనిపించింది పంజాబ్ కింగ్స్. బ్యాటర్లను కట్టడి చేయడంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విఫలం అయ్యారు. ఎప్పటికప్పుడు వికెట్లను తీసుకుంటూ వచ్చినప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేయలేకపోయారు. రెండేసి చొప్పున ఓవర్లను సంధించిన భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన పరుగులు 22, 19.

ఉమ్రాన్ మలిక్ ఫ్లాప్
రొమారియో షెప్పర్డ్ ఒకే ఓవర్లో 23 పరుగుల సమర్పించుకున్నాడు. జగదీష సుచిత్ నాలుగు ఓవర్ల కోటా నుంచి పంజాబ్ బ్యాటర్లు 38 పరుగులు పిండుకున్నారు. టీమిండియాకు ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ సైతం విఫలం అయ్యాడు. 2.1 ఓవర్లల్లో 24 పరుగులు ఇచ్చుకున్నాడు. ఉన్నవాళ్లల్లో ఫజల్ ఫారూఖీ కొంత ఫర్వాలేదనిపించుకున్నాడు. నాలుగు ఓవర్లలో 32 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్, జగదీష సుచిత్, ఉమ్రాన్ మలిక్ ఒక్కో వికెట్ కూల్చారు.

లివింగ్‌స్టొన్ విధ్వంసం..
పంజాబ్ బ్యాటర్ లియామ్ లివింగ్‌స్టొన్ ఎప్పట్లాగే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 22 బంతుల్లో 49 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాటింగ్ ఒక్కటే ఈ మ్యాచ్ మొత్తానికీ హైలైట్. చప్పగా సాగుతుందనుకున్న మ్యాచ్‌కు ఊపు తెచ్చాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్తుందనుకున్న దశలో రొమిరియో షెప్పర్డ్ వేసిన 15వ ఓవర్లోనే విజయానికి చేరువైంది పంజాబ్ కింగ్స్. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు లివింగ్‌స్టొన్. ఆ ఓవర్లో 23 పరుగులొచ్చాయి. ఆ మరుసటి ఓవర్ తొలి బంతికి మన్కడ్ బౌండరీ సాధించడంతో సన్‌రైజర్స్ పరాజయం పరిపూర్ణమైంది.