
ముంబై: సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది వరుసగా రెండో ఓటమి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 203 పరుగుల టార్గెట్‌ను అందుకోవడంలో తడబడింది. 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ అద్భుత పోరాట పటిమను ప్రదర్శించింది. తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 5వ తేదీన ఆడాల్సి ఉంది. ఢిల్లీ కేపిటల్స్‌ను ఢీ కొట్టబోతోంది.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 202 పరుగులు చేసింది. మొన్నటిదాకా పరుగులు చేయడానికి కష్టపడ్డ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కసారిగా విజృంభించాడు. 57 బంతుల్లో 99 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 55 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 85 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరి దెబ్బకు స్కోర్ 200లను దాటింది. మొన్నట్లాగే ఈ మ్యాచ్‌లోనూ బౌలర్లు విఫలం అయ్యారు. టీ నటరాజన్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్‌రైజర్స్ బ్యాటర్లు అద్బుతంగా పోరాడారు. 58 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని అందించారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ-39, కేప్టెన్ కేన్ విలియమ్సన్-47 పరుగులు చేశారు. రాహుల్ త్రిపాఠి విఫలం అయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఎయిడెన్ మార్క్‌రమ్ సైతం భారీ స్కోర్ చేయలేకపోయాడు. అతని కాంట్రిబ్యూషన్ 17 పరుగులే. శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లో ఎక్కువ సేపు నిల్చుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.

కేన్ విలియమ్సన్ 37 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో రెండు పోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. చివరి వరకూ క్రీజ్‌లో నిలవలేకపోయాడు. ఐపీఎల్ ఫార్మట్‌కు తగ్గట్టుగా అతని బ్యాటింగ్ ఉండట్లేదు. కుదురుకోవడానికి ఎక్కువ బంతులను తీసుకుంటున్నాడు. ఇది అతనిపై విమర్శలకు కారణమౌతోంది. బ్యాటింగ్ యావరేజ్ స్ట్రైక్ రేట్ వంద కంటే తక్కువగా ఉంటోంది. ఈ సీజన్‌లోనే లోయెస్ట్ స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడు కేన్ మామ.
కేన్ విలియమ్సన్ కొట్టిన రెండు సిక్సర్లల్లో ఒకటి సింగిల్ హ్యాండెడ్. డ్వైన్ ప్రిటోరియస్ బౌలింగ్‌లో ఒంటి చేత్తో సిక్స్ బాదాడు. 13వ ఓవర్ మూడో బంతిని సిక్స్‌గా మలిచాడు కేన్. ప్రిటోరియస్ సంధించిన గుడ్ లెంగ్త్ బంతిని మంచి టైమింగ్‌తో కనెక్ట్ కాగలిగాడు. మిడిల్ ఆఫ్ ది బ్యాట్‌ను కనెక్ట్ అయిన తరువాత ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంతో ఫెన్సింగ్ దాటిందా బంతి. అదో బ్యూటిఫుల్ షాట్ అనిపించింది. ఆ తరువాత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు కేన్. సాధారణంగా- సింగిల్ హ్యాండెడ్ సిక్సర్లను కొట్టే బ్యాటర్లలో రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. వంటి పించ్ హిట్టర్ల పేర్లు వినిపిస్తుంటాయి. ఇప్పుడా లిస్ట్‌లో కేన్ కూడా చేరాడు.