
లక్నో సూపర్ జెయింట్స్ టీంను 62పరుగుల భారీ తేడాతో ఓడించిన గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 ప్లేఆఫ్‌లకు అధికారికంగా అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. నిన్నటి మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పేలవ ప్రదర్శన కనబరిచారు. దీంతో లోస్కోరింగ్ మ్యాచ్‌గా ఈ మ్యాచ్ మారింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ మాత్రం చాలా చురుగ్గా ఆడి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఏకైక అర్ధ సెంచరీ చేసిన శుభ్‌మాన్ గిల్ 49బంతుల్లో 63పరుగులు చేశాడు. దీంతో టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 144/4స్కోరు చేసింది. తరువాత లక్నో టీం ఛేదనలో 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన గిల్.. తను వెన్ను నొప్పితోనే బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. మ్యాచ్ మధ్యలో వెన్ను నొప్పి ఉన్నా రాణించడం ఛాలెంజింగ్‌గా మారిందని పేర్కొన్నాడు.
'జట్టు కోసం చివరి వరకు క్రీజులో ఉండి ఆడడం చాలా సంతోషంగా అనిపించింది. ఆరంభంలో బంతి అంత సీమ్ అవుతుందని ఊహించలేదు. ఆపై స్పిన్నర్లు కొంత హిట్టింగ్ చేసే వీలు కల్పించే బౌలింగ్ చేస్తారని భావించాను. అయితే అనుకున్నదానికంటే స్పిన్నర్లు చాలా టఫ్‌గా వేశారు. కృనాల్ బౌలింగ్ చాలా టఫ్‌గా పడింది. అయినప్పటికీ స్పిన్నర్ల బౌలింగ్లో సింగిల్స్‌ను తీయడానికి వీలయింది. ఈ మ్యాచ్‌లో నాకు బ్యాక్ పెయిన్ సమస్య ఉంది. అయినా ఆడగలిగాను. ఇక అది తగ్గుతుందని ఆశిస్తున్నాను' అని శుభ్ మాన్ గిల్ అన్నాడు. ప్రస్తుతం ప్లేఆఫ్ చేరిన జీటీ ముందున్న మరో లక్ష్యం టాప్ 2 పొజిషన్లోకి వెళ్లడం. టాప్ 2లో గనుక చేరితో ఆ జట్టుకు ఒక్క మ్యాచ్ ఓడినా మళ్లీ పికప్ అయ్యేందుకు మరో మ్యాచ్‌లో అవకాశం ఉంటుంది. తద్వారా ఫైనల్ చేరడానికి జీటీకి మరో రెండు అవకాశాలు దక్కుతాయి.
ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున శుభ్‌మన్ గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడిన 12 మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలు సహా 384పరుగులు చేసి ఈ సీజన్లో నాల్గవ అత్యధిక పరుగుల స్కోరర్‌గా ఉన్నాడు. ఇక గిల్ ఎప్పుడూ చెప్పేదేంటంటే తన జట్టు ఆడుతున్నప్పుడు విజయంతో ముగించే నాక్ తాను ఆడాలనుకుంటానని చెబుతుంటాడు. ఈ మ్యాచ్ ద్వారా టీ20ప్రపంచకప్ టీమిండియా జట్టు ఓపెనర్ల లిస్టులో ఎంపిక చేయడానికి ముందంజ వేశాడు.