
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022కు ముందు తాను కొత్త శక్తితో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరానని సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రస్తుతం తాను చాలా బాధ్యతల నుంచి తప్పుకున్నానని చెప్పాడు. ప్రస్తుతం తాను జీవితంలో మంచి పొజిషన్‌లో ఉన్నానని, తమకు ఒక బిడ్డ కూడా ఉందని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నానని తెలిపాడు. తమ కూతురు ఎదుగుదలను చూడడంతోపాటు తనకు ఇష్టమైనవన్నీ చేస్తున్నానని చెప్పాడు.
అయితే ఐపీఎల్ సమయంలోనూ తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాతో చాలా వీడియో కాల్స్ మాట్లాడుతానని కోహ్లీ చెప్పాడు. ఇక ఐపీఎల్‌కు ఇది 15వ సీజన్ అన్న కోహ్లీ.. ఇది ఇంత దూరం రావడం నమ్మశక్యంగా లేదని అన్నాడు. కాగా ఐపీఎల్ 2022కు ముందు విరాట్ కోహ్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు. ఈ విషయాలన్నింటిని విరాట్ కోహ్లీ ఆర్సీబీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఫాఫ్ డుప్లిసెస్ ఎంపికైన వెంటనే అతనికి మిస్సేజ్ చేసినట్లు కోహ్లీ చెప్పాడు. తమకు ఈ సీజన్‌కు కెప్టెన్ కావాలనే విషయం తెలుసని, అందుకే ప్రణాళిక ప్రకారమే మెగా వేలంలో డుప్లిసెస్‌ను కొనుగోలు చేసినట్టు విరాట్ కోహ్లీ తెలిపాడు. ఇక కెప్టెన్‌గా డుప్లిసెస్‌కు కావాల్సినంత అనుభవం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో దక్షిణాఫ్రికాకకు డుప్లిసెస్ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేశాడు.
ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే గతేడాది టీ20 ప్రపంచకప్ సమయంలోనే ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించగా.. టెస్టు కెప్టెన్సీ నుంచి తనకు తానుగా తప్పుకున్నాడు. దీంతో ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఎక్కడ కూడా కెప్టెన్‌గా లేడు.
ఆర్సీబీ పూర్తి జట్టు ఇదే
విరాట్ కోహ్లీ(15 కోట్లు), మ్యాక్స్‌వెల్‌తో(11 కోట్లు), మహమ్మద్ సిరాజ్(7 కోట్లు), వానిందు హసరంగ (10.75 కోట్లు), హర్షల్ పటేల్(10.75 కోట్లు), డుప్లెసిస్ ( 7 కోట్లు), దినేశ్ కార్తీక్(5.5 కోట్లు), జోష్ హేజిల్ వుడ్ (7.75 కోట్లు), షాబాజ్ అహ్మద్(2.4 కోట్లు), అనుజ్ రావత్(3.4 కోట్లు), డేవిడ్ విల్లే ( 2 కోట్లు), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (కోటి) మహిపాల్ లామ్రోర్(95 లక్షలు), ఫిన్ అలెన్ ( 80 లక్షలు), జేసన్ బెహ్‌రెండోర్ఫ్ ( 75 లక్షలు), సిద్ధార్థ్ కౌల్(75 లక్షలు), కర్ణ్ శర్మ(50 లక్షలు), చామ మిలింద్(25 లక్షలు), సుయాశ్ ప్రభుదేశాయ్(30 లక్షలు), ఆకాశ్ దీప్, అనీశ్వర్ గౌతమ్, లువ్‌నిత్ సిసోడియా(వీరందరికీ 20 లక్షలు).