చేసిన పొరపాట్లే మళ్లీ: పీకల్దాకా తెచ్చుకుందిగా: రాజస్థాన్ రాయల్స్ ఓటమికి అయిదు కారణాలివే

కోల్‌కత: ఐపీఎల్ 2022 సీజన్ తొలి క్వాలిఫయర్‌లో రసవత్తరంగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్ తన జైత్రయాత్రను ప్లేఆఫ్స్‌లో కూడా కంటిన్యూ చేస్తోంది. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఈ జట్టు- అదే దూకుడుతో ఫైనల్స్‌కు వెళ్లి కూర్చుంది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం రాత్రి నాటి మ్యాచ్‌లో తన సమవుజ్జీ రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ సీజన్ ఫైనల్స్ చేరిన తొలి జట్టుగా ఆవిర్భవించింది. ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి సీజన్‌లోనే ఫైనల్స్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించిందీ గుజరాత్ టీమ్.

188 పరుగులు చేసినా..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ ఎప్పట్లాగే చెలరేగిపోయాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో నో బాల్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. కేప్టెన్ సంజూ శాంసన్-47, దేవ్‌దత్ పడిక్కల్-28 రాణించారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, యశ్ దయాళ్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయింది రాజస్థాన్ రాయల్స్.

మూడు వికెట్లే..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. ఎక్కడా తొట్రుపడలేదు. బ్యాటర్లందరూ సమష్టిగా సత్తా చాటారు. మాథ్యూవేడ్-35, శుభ్‌మన్ గిల్-35, హార్దిక్ పాండ్యా-40, డేవిడ్ మిల్లర్-68.. జట్టు విజయానికి అవసరమైన పరుగులను ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే సాధించారు. ఈ విజయంతో ఐపీఎల్ ఫైనల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్.

బౌలింగ్ నాసిరకం..
రాజస్థాన్ రాయల్స్ ఓటమిలో బౌలర్లకు కీలక పాత్ర పోషించారు. వరల్డ్ క్లాస్ బౌలింగ్.. ఈ కీలక మ్యాచ్‌లో నాసిరకంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్‌కే కూడబలుక్కుని విఫలం అయ్యారు. భారీగా పరుగులను సమర్పించుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కే.. 40 చొప్పున పరుగులను ఇచ్చుకున్నారంటే వారి బౌలింగ్ ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిలో ఒబెద్ ఒక్కడే ఓ వికెట్ తీశాడు.

ప్రారంభంలోనే వికెట్ పడగొట్టినా..
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలి ఓవర్‌లోనే కీలకమైన వృద్ధిమాన్ సాహా వికెట్‌ను తీసుకుంది. ఆ ఒత్తిడిని మిగిలిన బ్యాటర్లపై తీసుకుని రాలేకపోయింది. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, ఫస్ట్ డౌన్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. స్వేచ్ఛగా షాట్లు ఆడారు. గిల్ 21 బంతుల్లో 35, వేడ్ 30 బంతుల్లో 35 పరుగులు చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా 72 పరుగులు చేశారు. అక్కడే రాజస్థాన్ రాయల్స్ పరాయం ఖరారైంది. ఆ వెంటనే వేడ్‌ను కూడా అవుట్ చేయగలిగినప్పటికీ.. జట్టును ఆందోళనకు గురి చేయలేకపోయారు పింక్ టీమ్ బౌలర్లు.

10 ఓవర్లల్లో నో వికెట్..
ఇన్నింగ్ 10వ ఓవర్‌లో టైటాన్స్ స్కోరు 85 పరుగుల వద్ద మాథ్యూ వేడ్‌ను అవుట్ చేసిన బౌలర్లు.. ఇక మరో బ్యాటర్‌ను పెవిలియన్ పంపించలేకపోయారు. అదే చివరి వికెట్. లీగ్ దశలో ఒకట్రెండు మ్యాచ్‌లను గెలిపించిన డేవిడ్ మిల్లర్.. ఇక్కడా తన ప్రతాపాన్ని చూపాడు. రెచ్చిపోయి ఆడాడు. తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. 38 బంతుల్లో 68 పరుగులు చేశాడీ సౌతాఫ్రికన్ మిడిలార్డర్ బ్యాటర్. ఇందులో అయిదు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. బౌలింగ్‌లో చేసిన పొరపాట్లు చివరి ఓవర్‌లోనూ వెంటాడాయి. వాటిని సరిదిద్దుకోలేకపోయిందా టీమ్.

పరుగులను కట్టడి చేయలేక..
చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో బంతిని అందుకున్నాడు ప్రసిద్ధ్ కృష్ణ. పరుగులను కట్టడి చేయలేకపోయాడు. తొలి మూడు బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేశాడు డేవిడ్ మిల్లర్. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. దీనితో మరో మూడు బంతులు మిగిలివుండగానే విజయం గుజరాత్ టైటాన్స్‌ను వరించింది. అప్పటివరకు 35 బంతుల్లో 50 పరుగులతో ఉన్న డేవిడ్ మిల్లర్ వ్యక్తిగత స్కోర్.. 38 బంతులకు వచ్చేసరికి 68కి చేరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications