
అరకొరగా..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కేప్టెన్ సంజు శాంసన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ జోస్ బట్లర్ 22 పరుగులకే పరిమితం అయ్యాడు. షిమ్రోన్ హెట్మయిర్ 27 పరుగులు చేశాడు. హెట్మెయిర్ 13 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో మెరుపులు మెరిపించక పోయి ఉంటే ఆ స్కోర్ కూడా దక్కేది కాదు. రియాన్ పరాగ్ అతని దూకుడుకు తోడయ్యాడు. 12 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగులు చేశాడు.

బ్యాటింగ్ భారం అతనొక్కడి మీదేనా..
రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ భారం మొత్తాన్నీ ఓపెనర్ జోస్ బట్లర్ ఒక్కడే నిలకడగా మోస్తున్నాడనేది మరోసారి రుజువైంది. ఈ మ్యాచ్‌లో అతను 22 పరుగులకే అవుట్ కావడం.. సంజు శాంసన్ తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ భారీ స్కోర్‌ను సాధించకపోవడం రాజస్థాన్ రాయల్స్ పరాజయానికి కారణమైంది. సంజు అర్ధసెంచరీ చేశాడు గానీ.. ధాటిగా ఆడలేకపోయాడు. 54 పరుగులు చేయడానికి 49 బంతులను తీసుకున్నాడు. ఐపీఎల్ ఫార్మట్‌లో ఈ స్ట్రైక్ రేట్ సరిపోదు. రియాన్ పరాగ్-158.33, హెట్మెయిర్-207.69 స్ట్రైక్ రేట్ తరహాలో అతను ఆడివుంటే భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉండేది.

తొలి ఓవర్లల్లో బౌలర్లు చెలరేగినా..
లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ప్రారంభంలో చెలరేగినా ఆ తరువాత చతికిల పడ్డారు. ఆరోన్ ఫించ్‌ను నాలుగో ఓవర్‌లోనే వెనక్కి పంపారు. ఆరో ఓవర్‌లో బాబా ఇంద్రజిత్‌ను అవుట్ చేశారు. మరో వికెట్ తీసుకోవడానికి 13వ ఓవర్ వరకూ ఎదురు చూడాల్సి వచ్చింది రాజస్థాన్‌కు. ఆ ఓవర్ అయిదో బంతికి శ్రేయాస్ అయ్యర్ అవుట్ అయిన తరువాత.. మళ్లీ వికెట్ పడలేదంటే రాజస్థాన్ బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నితీష్-రింకూ పార్ట్‌నర్‌షిప్..
మిడిల్ ఆర్డర్‌లో నితీష్ రాణా, రింకూ సింగ్‌ల భాగస్వామ్యాన్ని విడదీయ లేకపోయారు రాజస్థాన్ బౌలర్లు. 92 పరుగుల వద్ద తీసుకున్న శ్రేయాస్ అయ్యర్ వికెట్టే చివరిదయింది. చివరి ఏడు ఓవర్లల్లో ఒక్క వికెట్‌ను కూడా తీసుకోలేకపోయారు. నితీష్ రాణా-రింకూ సింగ్ ద్వయం వికెట్ నష్టపోకుండా 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. నితీష్ రాణా 37 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 48, రింకూ సింగ్ 23 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

అశ్విన్-చాహల్ వికెట్ లెస్..
రవిచంద్రన్ అశ్విన్, యజువేందర్ చాహల్ వికెట్‌లెస్‌గా మారారు. వారిద్దరూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. ఇద్దరూ కలిసి 64 పరుగులు ఇచ్చుకున్నారు. రవిచంద్రన్ అశ్విన్ తన నాలుగు ఓవర్లల్లో కోటాలో 33, యజువేందర్ చాహల్ 31 పరుగులు ధారదాత్తం చేశారు. ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్‌దీప్ సేన్ తలా ఓ వికెట్ పడగొట్టారంతే.


Click it and Unblock the Notifications
