
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన ఆట తీరుతో ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిట్‌మ్యాన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రోహిత్ ఆటతీరు ఆ స్థాయిలో అభిమానులను మంత్ర ముగ్దులను చేస్తుంటుంది. ఈ అభిమానమే రోహిత్ ఆటను చూడడానికి అభిమానులను లండన్ నుంచి పుణే రపించింది.
బుధవారం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు పలువురు రోహిత్ శర్మ అభిమానులు లండన్ నుంచి మ్యాచ్ జరిగిన పుణే వచ్చారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో సదరు అభిమానులు ముంబై జెర్సీలు ధరించి రోహిత్ శర్మ కోసం లండన్ నుంచి వచ్చినట్లు ఓ ఫ్లకార్డుపై రాసి దానిని మైదానంలో ప్రదర్శించారు. ఈ ఫోటోను పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతానైట్ రైడర్స్ విజయం సాధించింది. కోల్‌కతా ఆల్‌రౌండర్ కమిన్స్ ఊహించని విధ్వంసంతో మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్లు తేడాతో 162 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. డానియల్ సామ్స్ వేసిన 16వ ఓవర్లో కమిన్స్ ఏకంగా 35 పరుగులు బాది ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
మొత్తంగా 15 బంతులు ఎదుర్కొని 56 పరుగులు చేశాడు. కమిన్స్ విధ్వంసలో 6 సిక్సులు, 4 ఫోర్లు ఉన్నాయి. కమిన్స్‌కు తోడు వెంకటేష్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఆ జట్టు ఇంకా బోణి చేయకపోవడం గమనార్హం.

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (38*), కీరన్ పొలార్డ్ (22*) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇషాన్ కిషన్ 14 పరుగులు చేయగా.. రోహిత్ శర్మ 3 పరుగులకే ఔట్ అయి మరోసారి నిరాశపరిచాడు.