
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. చివరి మూడు కీలక మ్యాచ్‌లను ఆడబోతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టబోతోంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ముంబైలోని వాంఖెడె స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. దీని తరువాత పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ప్రస్తుతానికి 12 పాయింట్లతో రాయల్ ఛాలెంజర్స్ సేఫ్ జోన్‌లో ఉంది గానీ.. మిగిలిన మూడింట్లోనూ గెలవాల్సి ఉంటుంది.
వరుసగా మూడు మ్యాచ్‌లల్లో ఓటమిపాలు కావడం రాయల్ ఛాలెంజర్స్‌ను ఇబ్బందులకు గురి చేసింది. పాయింట్లను తగ్గించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడిపోయింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్ 5 నుంచి దిగజారినప్పటికీ.. ఆ తరువాతి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి- మళ్లీ రేసులోకొచ్చింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉందీ ఫాఫ్ డుప్లెసిస్ టీమ్. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి ఓడినా ఇబ్బందికర పరిస్థితులను చవి చూడాల్సి వస్తుందా జట్టుకు.
ఈ పరిణామాల మధ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ.. తన జెర్సీని మార్చివేసింది. లేత ఆకుపచ్చ రంగతో కూడిన జెర్సీని ధరించబోతోంది. ఈ కొత్త జెర్సీతోనే ఆదివారం మధ్యాహ్నం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఢీ కొడుతుంది. గో గ్రీన్ జెర్సీగా దీన్ని ప్రకటించింది రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీ. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకున్నట్లు తెలిపింది.
ఐపీఎల్ అన్ని ఫ్రాంఛైజలకు చెందిన రాష్ట్రాల్లో గల చారిత్రక కట్టడాలను ఆకుపచ్చరంగులో డిజైన్ చేసిన ఫొటోలను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. రాజస్థాన్ రాయల్స్-జైపూర్ ప్యాలెస్, ఢిల్లీ కేపిటల్స్- ఢిల్లీ గేట్, కోల్‌కత నైట్‌రైడర్స్-విక్టోరియా ప్యాలెస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- విధానసౌధ, పంజాబ్ కింగ్స్-గురుద్వారా, లక్నో సూపర్ జెయింట్స్-ఏక్ మినార్, గుజరాత్ టైటాన్స్- అక్షర్ ధామ్ మందిర్ వంటి చారిత్రక కట్టడాలకు చెందిన ఫొటో లేఅవుట్లు, గ్రీన్ జెర్సీని ధరించిన ప్లేయర్ల వీడియో క్లిప్పింగులను పోస్ట్ చేసింది.