

ఈ ఐపీఎల్ సీజన్లో ఏబీ డివిల్లియర్స్ లేకపోవడం గురించి మాట్లాడుతూ ఆర్సీబీ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు. డివిల్లియర్స్ లేకపోవడం తనకు ఆశ్చర్యంగా ఉందని కోహ్లీ చెప్పాడు. ఆర్సీబీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో కోహ్లీ ఈ అంశం గురించి మాట్లాడాడు. అలాగే డివిల్లియర్స్ క్రికెట్‌కు ముఖ్యంగా ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన రోజు గురించి గుర్తు చేసుకున్నాడు. దుబాయ్‌లో టీ20 ప్రపంచకప్ ముగించుకుని భారత్ తిరిగొస్తుండగా డివిల్లియర్స్ తనకు ఒక వాయిస్ మిస్సేజ్ పంపినట్లు చెప్పాడు.
అందులో ఐపీఎల్‌తోపాటు అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు డివిల్లియర్స్ వెల్లడించాడని తెలిపాడు. ఆ సమయంలో భార్య అనుష్క శర్మ తన పక్కనే ఉందని, వాయిస్ మిస్సేజ్ వినగానే తన వైపు ఆశ్చర్యంగా చూసినట్లు పేర్కొన్నాడు. ఆమె ఏమైందని అడగగా విషయం చెప్పానని అన్నాడు. దీంతో తనకు ఏం చెప్పొద్దని అనుష్క శర్మ చెప్పినట్లు కోహ్లీ తెలిపాడు.
ఎందుకంటే డివిల్లియర్స్ ఈ నిర్ణయం తీసుకుంటాడని అనుష్క శర్మ ముందే గ్రహించిందని విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే తనకు కూడా డివిల్లియర్స్ ఈ నిర్ణయం తీసుకుంటాడని గత ఐపీఎల్ సీజన్లోనే అనుమానం వచ్చిందని చెప్పాడు. ఎందుకంటే గత సీజన్లో ఓ సారి తనతో మాట్లాడుతూ నీతో కాఫీ తాగాలని, చాలా విషయాలు చెప్పాలని డివిల్లియర్లు అన్నట్లు పేర్కొన్నాడు. కానీ తనకు ఆ రోజు ఏదోలా ఉండడం వల్ల కాఫీకి వెళ్లలేకపోయానని చెప్పాడు.
అప్పుడే ఈ విషయమై తనకు అనుమానం వచ్చినట్లు కోహ్లీ తెలిపాడు. డివిల్లియర్స్ అంతకు ముందు ఎన్నడూ అలా మాట్లాడలేదని తెలిపాడు. అతడితో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పిన కోహ్లీ.. ఈ సారి కప్ గెలిస్తే డివిల్లియర్స్‌నే గుర్తు చేసుకుంటానని చెప్పాడు. బెంగళూరు కప్ గెలవడం డివిల్లియర్స్‌కు ఎంత ఇష్టమో తనకు తెలుసని, అతనొక అద్భుతమైన వ్యక్తి అని ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.
ఇక ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసి 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించి పంజాబ్ విజయం సాధించింది.