
పంజాబ్ పరిస్థితేంటీ..?
ఈ సాయంత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగబోతున్నాయి. ముంబైలోని సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ భవితవ్యాన్ని తేల్చేసే మ్యాచ్ ఇది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు తోడుగా ప్లేఆఫ్స్ నుంచి బయటికి వెళ్లిపోవడమా? లేక పోరాడి సాధించుకోవడమా? అనేది పంజాబ్ ప్లేయర్ల మీద ఆధారపడి ఉంది.

అదే సీక్వెన్స్ ఫాలో..
ఈ సీజన్‌లో కూడా పంజాబ్ తలరాతేమీ మారలేదు. పడుతూ లేస్తూ సాగుతోందా జట్టు ప్రస్థానం. 11 మ్యాచ్ తరువాత కూడా వరుసగా రెండింట్లో విజయం సాధించలేదు. ఒక గెలుపు, ఒక ఓటమి తరహా సీక్వెన్స్‌ను అనుసరిస్తోంది. వరుసగా రెండు ఓటములను నమోదు చేసిందే గానీ.. రెండు విజయాలను అందుకోవట్లేదు. తన చివరి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయింది. సీక్వెన్స్ ప్రకారం చూసుకుంటే ఇవ్వాళ్టి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై విజయం సాధించాల్సి ఉంటుంది.

బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా..
శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, భానుక రాజపక్స.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నప్పటికీ.. ఆడుతున్నది మాత్రం ఒకరిద్దరే. చివరి మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించారు గానీ.. బౌలర్లు ముంచారు. 189 పరుగుల భారీ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది పంజాబ్. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌లల్లో అయిదింట్లో నెగ్గింది. 10 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. గెలిస్తే 12 పాయింట్లతో ఢిల్లీ కేపిటల్స్‌తో సమవుజ్జీగా నిలుస్తుంది. ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుంది.

పరాజయంతో..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి దీనికి భిన్నం. సేఫ్ జోన్‌లో ఉందా జట్టు. ఒక్క మ్యాచ్ గెలిస్తే- 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్‌తో సమవుజ్జీగా ఉంటోంది. ఫస్ట్ హాఫ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో దారుణంగా ఓడింది బెంగళూరు. 205 పరుగుల భారీ స్కోర్ సాధించినప్పటికీ.. దాన్ని కాపాడుకోలేకపోయింది. పంజాబ్ దీన్ని అవలీలగా ఛేదించింది. దానికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది రాయల్ ఛాలెంజర్స్.

తుదిజట్టులో..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టులో- ఫాఫ్ డుప్లెసిస్ (కేప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రార్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్‌కు చోటు దక్కించుకోవచ్చు. పంజాబ్ కింగ్స్‌లో-జానీ బెయిర్‌స్టో,శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టొన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధవన్, రాహుల్ చాహర్, కగిసొ రబడ, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ ఆడొచ్చు.


Click it and Unblock the Notifications












