
|
ఢిల్లీ ఓడితేనే ప్లే ఆఫ్స్‌కు...
8 విజయాలు 16 పాయింట్లతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ జట్టు నెట్‌రన్‌రేట్ (-0.253) తక్కువగా ఉంది. దాంతో ఏడు విజయాలతో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే మెరుగైన రన్‌రేట్ (0.255) ఉన్న కారణంగా ఆర్సీబీ వెనక్కినెట్టి ప్లే ఆఫ్స్ చేరుతుంది.
ఒకవేళ ముంబై గెలిస్తే మాత్రం ఆర్సీబీకి అవకాశం దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ గెలవాలని ఆర్సీబీ అభిమానులతో పాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా ఇప్పుడు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్‌లే స్వయంగా వెల్లడించారు. తాము ఇప్పుడు ముంబై ఇండియన్స్ అభిమానులుగా మారిపోయామని, రోహిత్ సేనకే తమ మద్దతని ప్రకటించారు.
|
రోహిత్ ముందు మోకారిల్లుతున్న ఆర్సీబీ..
ఈ పరిస్థితిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ మద్దతు ఇచ్చినా.. ముంబై గెలిచినా ఓడినా ఆ జట్టుకు ఒరిగేదేం లేదని కామెంట్ చేస్తున్నారు. ఇక చివరి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు అవకాశాలిస్తామని ముంబై సారథి రోహిత్ శర్మ చెప్పిన నేపథ్యంలో.. ఆర్సీబీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరకుండా ముంబై కుట్రపన్నుతుందని కామెంట్ చేస్తున్నారు. కావాలనే ఓడిపోవాలని చూస్తుందని, ఇది ఏమాత్రం భావ్యం కాదంటున్నారు. మరికొందరు మాత్రం.. ఆర్సీబీకి లక్ ఫేవర్ చేస్తుందని, గుజరాత్ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందంటున్నారు. ఇదే జోరు కొనసాగించి టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
|
పాత గొడవలు పక్కనపెట్టి..
శనివారం జరిగే మ్యాచ్‌లో ముంబై గెలవాలని ఆర్సీబీ అభిమానులు పూజలు చేస్తారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని వారు కలలో కూడా ఊహించి ఉండరని సెటైర్లు పేల్చుతున్నారు. రోహిత్ ఫొటోకు దండం పెడుతున్న మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ.. స్వయంగా రోహిత్‌కు ఫోన్ చేసి విజయం సాధించాలని కోరినట్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక పాత గొడవలన్నీ పక్కనపెట్టి ఈ రోజు తమకు కోసం గెలవాలని ముంబై ఇండియన్స్‌ను కోరుతున్నట్లు సృష్టించిన మీమ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.