

సూపర్ ఫామ్‌లో జడేజా
ప్రస్తుతం ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆటగాడిగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్, బాల్‌తో రాణిస్తూ టీమిండియాలో, చెన్నైసూపర్ కింగ్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక జడేజా ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెరుపు ఫీల్డింగ్‌తో బంతులను వడిసి పట్టుకోవడం జడేజాకే సాధ్యమవుతుంది. ఇక మిడిలార్డర్‌లో హిట్టింగ్‌తో వేగంగా పరుగులు రాబడుతున్నాడు. బౌలర్‌గా తన స్పిన్ మాయజాలంతో బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నాడు. కనుక ప్రసత్తం ఆటగాడిగా జడేజా ఫామ్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

కెప్టెన్‌గా జడేజా సక్సెస్ అవుతాడా?
చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్‌గా జడేజాను నియమించడం బాగానే ఉన్నప్పటికీ అతను సారథిగా సక్సెస్ అవుతాడా? లేదా? అనే అనుమానాలు ప్రస్తుతం అందరిలో పుట్టుకొస్తున్నాయి. ఈ అనుమానాలకు కారణాలు కూడా లేకపోలేదు. 2008 నుంచి జడేజా ఐపీఎల్‌లో ఆడుతున్నప్పటికీ ఏ రోజు కూడా కెప్టెన్‌గా రాణించగలడని అనిపించుకోలేదు. అంత ఎందుకు సీఎస్కేకు ధోని తర్వాత అంతా సురేష్ రైనాను కెప్టెన్‌గా భావించారు కానీ ఏనాడు కూడా జడేజా పేరు ఎత్తలేదు. అసలు ఇప్పటివరకు ఎక్కడా ఒక్క మ్యాచ్‌కు కూడా జడేజా కెప్టెన్‌గా చేయలేదు. అలాంటి జడేజాకు ఉన్నట్లుండి ఒక్క సారిగా పూర్తి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం కాస్త కలవరపరిచే అంశంగా చెప్పుకోవాలి.

అభిమానుల్లో ఆందోళన
అసలు కెప్టెన్‌గా జడేజా సత్తా ఎంటో తెలుసుకోకుండా ఇలా ఓ సీజన్ బాధ్యతలు మొత్తం అప్పగిస్తుండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన టీంగా పేరున్న చెన్నైసూపర్ కింగ్స్‌ను కెప్టెన్‌గా ఎలాంటి అనుభవం లేని జడేజా విజయవంతంగా నడిపించగలడా అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి. నిజానికి ఈ సీజన్‌లో ధోనినే కెప్టెన్‌గా ఉంటాడని, తర్వాతి సీజన్ నుంచి జడేజా ఆ బాధ్యతలను చేపడుతాడని అంతా భావించారు. దీంతో జడ్డూ భాయి ఈ లోపు కెప్టెన్‌గా పరిణతి చెందుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా జడేజాకు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అభిమానులకు ఆందోళన కల్గిస్తోంది.

జడేజా బలాలు
సీఎస్కే కెప్టెన్సీ చేపట్టబోతున్న జడేజా బలాలను ఒక సారి పరిశీలిస్తే ప్రస్తుతం ఆటగాడిగా అన్ని విభాగాల్లో సూపర్ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. అలాగే పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అంచనాలకు అనుగుణంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో రాణిస్తున్నాడు. ఒక రకంగా ప్రస్తుతం జడేజా కెరీర్లో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. కెప్టెన్ జడేజా అయినప్పటికీ ఈ సీజన్లో సాధారణ ఆటగాడిగా ధోని కొనసాగనున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే జడేజాను ధోని వెనుక ఉండి నడిపించనున్నాడు. దీంతో మైదానంలో కష్ట సమయంలో ధోని అండ ఉండడం జడేజా అతి పెద్ద బలం కానుంది. అలాగే సీఎస్కే టీం అన్ని విభాగాల్లో బలంగా ఉండడం కూడా జడేజాకు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అంతా స్టార్ ఆటగాళ్లతో కూడిన చెన్నైని విజయవంతంగా నడిపించడం పెదగా కష్టం కాదని చెప్పుకోవాలి. 2012 నుంచి సుదీర్ఘ కాలంపాటు సీఎస్కేలోనే ఆడుతుండడంతో ఆ జట్టు గురించి జడేజాకు పూర్తి పట్టు ఉండడం కూడా కలిసి రానుంది.

జడేజా బలహీనతలు
ఇప్పటివరకు ఒక సారి కూడా కెప్టెన్సీ చేపట్టకపోవడమే జడేజాకు అతిపెద్ద బలహీనతగా చెప్పవచ్చు. కెప్టెన్‌గా ఏ మాత్రం అనుభవం లేకపోవడం కలవరపరిచే అంశమే పరిగణించాలి. అలాగే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన టీంగా పేరున్న సీఎస్కేను విజయవంతంగా నడిపించడం జడేజాకు అతి పెద్ద సవాల్‌గా పరిగణించవచ్చు. ఏ మాత్రం తేడా వచ్చిన విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ధోని వారసుడు అంటే ధోని రేంజులోనే అంచనాలు ఉంటాయి. దీంతో గొప్ప కెప్టెన్సీ లక్షణాలున్న ధోని స్థానాన్ని జడేజా సమర్థవంతంగా ఎంతవరకు భర్తీ చేయగలడనేది ఆసక్తిగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే భారీ అంచనాలుండడం జడేజాకు బలహీనతగా మారే అవకాశాలున్నాయి. ఇక కెప్టెన్‌గా జడేజా ఏ మాత్రం ఒత్తిడిని తట్టుకోగలడనేది వేచి చూడాలి.

జడేజా రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పవరకు 200 మ్యాచ్‌లు ఆడిన జడేజా 27 సగటుతో 2386 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు చేయగా అత్యధిక స్కోర్ 62 పరుగులుగా ఉంది. ఇక బౌలర్‌గా 127 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ గణాంకాలు 5/16 గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











