
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై చెన్నైసూపర్ కింగ్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే శివమ్ దూబే (95), రాబిన్ ఊతప్ప (88) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ 193 పరుగులకే పరిమితమైంది. చెన్నై బౌలర్లు మహేష్ తీక్షణ, రవీంద్ర జడేజా తమ స్పిన్ మాయ జాలంతో వికెట్లు తీశారు. తీక్షణ 4, జడేజా 3 వికెట్లు తీశారు. అయితే ఈ 3 వికెట్లతో చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ రవీంద్ర జడేజా ఓ రికార్డు సృష్టించాడు. ఈ 3 వికెట్లతో కలిపి ఆర్సీబీపై ఇప్పటివరకు 26 వికెట్టు తీసిన జడేజా ఐపీఎల్‌లో ఆ జట్టుపై ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీపై 24 వికెట్లు తీసిన ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను అధిగమించాడు. ఇక ఆర్సీబీపై 23 వికెట్లు తీసిన ఆశిష్ నెహ్రా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
మొత్తంగా ఐపీఎల్‌లో ఇప్పటివరకు 205 మ్యాచ్‌లాడిన రవీంద్ర జడేజా 131 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/16గా ఉన్నాయి. ఇక బ్యాటింగ్‌లో 26 సగటుతో 2452 పరుగులు చేశాడు. రెండు సార్లు హాఫ్ సెంచరీ చేయగా అత్యధిక స్కోర్ 62 పరుగులుగా ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయంతో ఐపీఎల్‌లో చెన్నైసూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలతో ఒక స్థానం మెరుగుపరచుకుంది. ఇప్పటివరకు పదో స్థానంలో ఉన్న సీఎస్కే ఒక విజయంతో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఇక టోర్నీలో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా గెలవని ముంబై ఇండియన్స్ పదో స్థానానికి పడిపోయింది. సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇక రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కోల్‌తా నైట్ రైడర్స్, లక్నోసూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉన్నాయి. ఈ జట్లన్నీ కూడా మూడేసి మ్యాచ్‌లే గెలిచినప్పటికీ రన్‌రేట్‌లో తేడా కారణంగా వాటి స్థానాల్లో మార్పులు వచ్చాయి. ఇక ఆరో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ఏడో స్థానంలో పంజాబ్ కింగ్స్, ఎనిమిదో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈ జట్లన్నీ రెండేసి మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.