
టీ20 ఫార్మాట్ అంటేనే బ్యాటర్ల ఫార్మాట్‌గా పేరు ఉంది. ఈ ఫార్మాట్‌లో బ్యాటర్లు వీర విహారం చేస్తారు. ఈ క్రమంలో బౌలర్లను ఉతికి ఆరేస్తూ తమకు వీలైనన్నీ పరుగులు పిండేసుకుంటారు. ఇక ఐపీఎల్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ లీగ్‌లో బ్యాటర్లు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే టీ20 ఫార్మాట్లో బౌలింగ్ చేయడమనేది బౌలర్లకు కత్తి సాము అనే చెప్పుకోవాలి. అయితే అలాంటి టీ20 ఫార్మాట్లో సైతం బ్యాటర్లను పరుగులు చేయనీకుండా ముప్పతిప్పలు పెట్టిన బౌలర్లు ఎంతో మంది ఉన్నారు. ఇక ఐపీఎల్‌లో అయితే అలాంటి బౌలర్లకు కొదవే లేదు. ఐపీఎల్‌లో బెస్ట్ ఎకానమీతో అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన టాప్ బౌలర్ల జాబితాను ఓ సారి పరిశీలిద్దాం. కాగా కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన బౌలర్లను పరిగణనలోకి తీసుకోని ఈ జాబితాను తయారు చేశారు.
ఐపీఎల్‌లో అత్యుత్తమ ఎకానమీతో అతి తక్కువ పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 76 మ్యాచ్‌లు ఆడిన రషీద్ ఖాన్ కేవలం 6.33 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇక రెండో స్థానంలో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. మురళీధరన్ 6.67 ఎకానమీతో బౌలింగ్ చేసి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 66 మ్యాచ్‌ల్లో మురళీధరన్ 63 వికెట్లు తీశాడు. ఇక 6.72 ఎకానమీతో బౌలింగ్ చేసిన వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా 135 మ్యాచ్‌లాడిన నరైన్ 143 వికెట్లు తీశాడు. నాల్గో స్థానంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. 167 మ్యాచ్‌ల్లో 6.91 ఎకానమీతో బౌలింగ్ చేసిన అశ్విన్ 145 వికెట్లు తీశాడు.
ఈ జాబితాలో సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ ఐదో స్థానంలో ఉన్నాడు. 95 మ్యాచ్‌లాడిన డేల్ స్టెయిన్ 6.91 ఎకానమీతో బౌలింగ్ చేసి 97 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. 163 మ్యాచ్‌లాడిన 7.07 ఎకానమీతో 150 వికెట్లు తీశాడు. ఈ లిస్ట్‌లో డేల్ స్టెయిన్ రూపంలో ఒకే ఒక్క పేసర్ ఉండడం గమనార్హం. ఈ గణాంకాలు చూసిన పలువురు నెటిజన్లు ఈ బౌలర్లు మరి ఇంత పిసినార్లు ఎంది సామి.. ఇంత తక్కువ పరుగులు ఇచ్చారని కామెంట్ చేస్తున్నారు.