న్యూఢిల్లీ: అప్‌కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అఫ్గానిస్థాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్, యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నయా ఫ్రాంచైజీ అహ్మదాబాద్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీని దక్కించుకున్న సీవీసీ క్యాపిటల్.. అప్‌కమింగ్ సీజన్ కోసం అన్ని విధాలుగా సమాయత్తం అవుతోంది. ఇప్పటికే జట్టు కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా, హెడ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజ ప్లేయర్ గ్యారీ కిర్‌స్టన్, టీమ్ డైరక్టర్‌గా ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ విక్రమ్ సోలంకీని నియమించింది. గతంలోఆర్సీబీకి పనిచేసిన ఈ త్రయం మళ్లీ అహ్మదాబాద్ కోసం రెడీ అయింది.
మెగా వేలానికి ముందు కీలక ఘట్టమైన రిటెన్షన్ ప్రక్రియ ముగియగా.. కొత్త జట్లు ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ నెల 22లోపు కొత్తగా లీగ్‌లోకి వచ్చిన అహ్మదాబాద్, లక్నో ఈ ప్రక్రియను ముగించాల్సి ఉంది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ ఆలౌరౌండర్ హార్దిక్ పాండ్యా, స్పిన్ సెన్సేషన్ రషీద్ ఖాన్‌ను తీసుకుందని పాండ్యా కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతుంది. మూడో ప్లేయర్‌గా ఇషాన్ కిషన్‌ను తీసుకుందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈఎస్పీఎన్ మాత్రం ఇషాన్ కిషన్‌కు బదులు శుభ్‌మన్ గిల్‌ను తీసుకుందని పేర్కొంది.
అంతేకాకుండా ఈ ముగ్గురి ఆటగాళ్ల సాలరీ డ్రాఫ్ట్ వివరాలను కూడా వెల్లడించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ముగ్గురు ఆటగాళ్లను తీసుకుంటే రూ.15 కోట్లు, రూ. 11 కోట్లు, రూ. 7 కోట్లు చెల్లిచాలి. కానీ అహ్మదాబాద్ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌కు రూ.15 కోట్లు చెల్లించేందుకు సిద్దమైందని, శుభ్‌మన్ గిల్‌ను రూ. 7 కోట్లకు తీసుకుందని తెలిపింది.
గత రెండేళ్లుగా హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. వెన్ను గాయంతో జట్టుకు దూరమై సర్జరీ చేసుకున్న అతను రీఎంట్రీలో మునపటిలా రాణించలేకపోతున్నాడు. బౌలింగ్‌కు పూర్తిగా దూరమైన అతను బ్యాట్స్‌మన్‌గా కూడా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో అతని ఘోర వైఫల్యం టీమిండియా పరాజయానికి కారణమైంది. దాంతో అతన్ని జట్టు నుంచి తప్పిస్తూ సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన హార్దిక్ పాండ్యా.. ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్నాడు.
ఇక గత సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన రషీద్ ఖాన్.. డబ్బుల కోసమే ఆ జట్టును వీడాడు. తొలి ప్రాధాన్యత ఆటగాడిగా ఎంచుకోవాలని పట్టుబట్టాడు. ఇక శుభ్‌మన్ గిల్ గతేడాది వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడాడు.