
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్‌లో గుజరాత్ టైటాన్స్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6వికెట్ల తేడాతో ఓడించి సీజన్‌లో ఎనిమిదో విజయాన్ని గుజరాత్ అందుకుంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ 20ఓవర్లలో 170/6 స్కోరు చేసింది. ఛేదనలో గుజరాత్ స్టార్లు రాహుల్ తెవాతీయా (25 బంతుల్లో 43 నాటౌట్), డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 39నాటౌట్) చెలరేగారు. దీంతో మూడు బంతులు మిగిలి ఉండగానే గుజరాత్ గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్లో రాహుల్ తెవాతీయా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ వరుసగా జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇప్పటివరకు తెవాతీయా 161.26 స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడు. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 44.75సగటుతో 179పరుగులు చేశాడు. అలాగే నాలుగు ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలిచాడు.
నిన్నటి మ్యాచ్‌లో 13వ ఓవర్‌లో సాయి సుదర్శన్ ఔటయ్యాక తెవాతీయా క్రీజులోకి వచ్చాడు. ఆ టైంలో జట్టు విజయం సాధించడానికి 43బంతుల్లో మరో 76పరుగులు చేయాల్సి ఉంది. మిల్లర్‌తో కలిసి తెవాతీయా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఆన్ సైడ్, ఆఫ్-సైడ్‌లలో ఖతర్నాక్ షాట్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం తెవాతీయా మాట్లాడుతూ.. 'ఈ సీజన్‌కు ముందు ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కొనేందుకు చాలా శ్రమించాను. ఆఫ్-సైడ్ షాట్లు కొట్టడం బాగా ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే బౌలర్లు ఆఫ్ స్టంప్ బంతులు వేస్తూ.. తదనుగుణంగా ఫీల్డ్ సెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్లాన్లు వేయడం ప్రారంభించడం గమనించాను. అందుకే ఆఫ్ సైడ్ గ్యాప్‌లను ఉపయోగించి షాట్లు బాదాడంలో మెలకువలు తెలుసుకున్నా. ఇప్పుడు నేను ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ షాట్లు ఆడగలను' అని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం తెలిపాడు.
ఛేజింగ్ టైంలో ఎలా కూల్‌గా ఉండగలవని తెవాతీయాను ప్రశ్నించగా అతను స్పందిస్తూ.. 'నేను కూల్‌గా ఉండడానికి ప్రయత్నిస్తా కానీ.. లోపల ఉండే టెన్సన్ వేరే లెవల్లో ఉంటది. మైండ్లో ఎలా ఆడాలి, ఏ బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోవాలి అని ఆలోచిస్తూనే ఉంటా.' అని పేర్కొన్నాడు. 'అలాగే ఆఫ్ సైడ్, ఆన్ సైడ్ హిట్టింగ్‌నే ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే రివర్స్ స్వీప్, బ్యాక్ సైడ్ షాట్లు అంత వర్కవుట్ అవ్వకపోవచ్చు. అలాగే ముందుగా కొన్ని షాట్లు అనుకుంటా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నిస్తా' అని తెలిపాడు.