
ప్లేఆఫ్స్‌కు చేరిన టీమ్స్ ఇవే..
ఈ సీజన్లో మొత్తం నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు అడుగు పెట్టాయి. ఈ సీజన్‌తో తమ ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ ఆడనున్నాయి. ఈ రెండు జట్లు కూడా తమ ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. పాయింట్ల పట్టికలో తొలి, మూడో స్థానంలో నిలిచాయి. ఈ రెండింటితో పాటు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి.

టేబుల్ టాపర్‌గా.
గుజరాత్ టైటాన్స్-20, రాజస్థాన్ రాయల్స్-18, లక్నో సూపర్ జెయింట్స్-18, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. ఈ సీజన్లోనే ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్- లీగ్ దశలో దుమ్ములేపిన విషయం తెలిసిందే. 14 మ్యాచ్‌లల్లో నాలుగింట్లో మాత్రమే ఓడింది. 20 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అలాంటి జట్టుతో- 18 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.

తొలి క్వాలిఫయర్..
తొలి క్వాలిఫయర్ ఈ సాయంత్రం 7:30 గంటలకు కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్, సంజు శాంసన్ నాయకత్వాన్ని వహిస్తోన్న రాజస్థాన్ రాయల్స్.. ఈ మ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. రెండో క్వాలిఫయర్ ఆడుతుంది. రెండో క్వాలిఫయర్ ఈ నెల 27న షెడ్యూల్ అయింది.

జోస్ బట్లర్‌పై..
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌పైనే అందరి దృష్టీ నిలిచింది. ఈ సీజన్లో అతని బ్యాటింగ్ మొత్తం టాప్ గేర్‌లో కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లల్లో ఏకంగా 629 పరుగులు చేశాడీ ఇంగ్లాండ్ బ్యాటర్. ఇందులో మూడు సెంచరీలు, మరో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 48.38 సగటును నమోదు చేశాడు. 146.96 స్ట్రైక్ రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ సాయంత్రం ఈడెన్ గార్డెన్స్‌లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడనేది ఆసక్తి రేపుతోంది.

సంజు సాహా..
కేప్టెన్ సంజు శాంసన్ సహా రాజస్థాన్ రాయల్స్ జట్టులో పించ్ హిట్టర్లకు కొదవలేదు. మెరికల్లాంటి బ్యాటర్లు, నిప్పులు చెరిగే బౌలర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్ నిలకడగా రాణిస్తున్నాడు. సంజు శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అశ్విన్ సహా ట్రెంట్ బౌల్ట్, యజువేంద్ర చాహల్, ఒబెద్ మెక్కే, కుల్దీప్ సేన్లతో కూడిన బౌలింగ్ లైనప్ బలంగా ఉంది.

హార్దిక్ పాండ్యాపై..
గుజరాత్ టీమ్ మొత్తం సూపర్ ఫామ్‌లో ఉంది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, కేప్టెన్ హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్.. ఇలా అందరూ కళ్లు చెదిరే షాట్లను ఆడగలిగేవారే. డేవిడ్ మిల్లర్-రాహుల్ తెవాతియా ద్వయం.. లీగ్ దశలో మ్యాచ్‌లను గెలిపించింది. రషీద్ ఖాన్ సైతం లీగ్ దశలో ఓడిపోయే ఒకట్రెండు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. దాదాపుగా ఆల్‌రౌండర్లతో నిండివున్న టీమ్ ఇది.

తుదిజట్టులో..
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టులో- జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కేప్టెన్-వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఒబెద్ మెక్కే, యజువేంద్ర చాహల్, కుల్దీప్ సేన్ ఆడే అవకాశం ఉంది. గుజరాత్ టైటాన్స్ తుదిజట్టులో- శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిశోర్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్, యష్ దయాళ్‌కు చోటు దక్కొచ్చు.