ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్టార్ ఓపెనర్ పృథ్వీ షా అనారోగ్యంతో హాస్పిటల్ పాలయిన సంగతి తెలిసిందే. అయితే అతని ఆరోగ్యం కుదుటపడకపోవడంతో లీగ్ స్టేజ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాల్సిన మిగతా రెండు ముఖ్యమైన మ్యాచ్‌లకు అతను దూరం కానున్నాడని ఇటీవలే ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ తాజాగా మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. పృథ్వీ షా పూర్తిగా కోలుకున్నాడని తెలిసింది. ఇక మళ్లీ ఢిల్లీ జట్టులో చేరతాడని తెలుస్తోంది. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు పృథ్వీ షా అందుబాటులోకి రానున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది.
ఇక పృథ్వీ షా టైఫాయిడ్ బారిన పడ్డాడని గత మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రిషబ్ పంత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పృథ్వీ షా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సీజన్లో చివరిసారి మే 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షా ఆడాడు. ఆ తర్వాత జ్వరం బారిన పడటంతో.. హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో అతను ఆడలేదు. అతని స్థానంలో మన్దీప్ సింగ్, కేఎస్ భరత్ అవకాశం దక్కించుకున్నా వారు ఏమాత్రం రాణించలేదు.
ఇప్పటి వరకు 12మ్యాచ్‌ల్లో 6విజయాలు సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్.. 12పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలుపొంది ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. అయితే.. ఇతర జట్లు కూడా పోటీలో ఉండటంతో ఢిల్లీ మెరుగైన రన్‌రేట్ సాధిస్తేనే ప్లేఆఫ్స్ చేరుకోవడానికి వీలు పడుతుంది. పృథ్వీ లాంటి డాషింగ్ ఓపెనర్ మిగతా రెండు మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చినట్లయితే ఆ జట్టుకు కొంత సానుకూలత ఉంటుంది. ఇక పృథ్వీ ఈ సీజన్లో ఆడిన 9మ్యాచ్‌ల్లో 28.78సగటుతో 259పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అతని స్ట్రైక్ రేటు 158గా ఉంది. అంటే వచ్చీ రాగానే బౌలర్ల మీద ఎటాక్ చేస్తాడన్న మాట. మరోవైపు వార్నర్ అండగా చెలరేగే షా సోమవారం నాటి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తే తప్పకుండా ఢిల్లీకి మంచి ప్లస్ అవుతుంది.