
పంజాబ్ పరిస్థితి..
పంజాబ్ పరిస్థితేమిటనేది ఇవ్వాళ్టి మ్యాచ్‌తో తేలిపోతుంది. దూకుడు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌లల్లో నాలుగింట్లో నెగ్గింది. ఎనిమిది పాయింట్లతో ఎనిమిదో స్థానానికి దిగజారింది. తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది. ఇవ్వాళ గుజరాత్ టైటాన్స్‌ను ఎదుర్కొనబోతోంది. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

పడుతూ లేస్తూ సాగుతున్న పంజాబ్
మయాంక్ అగర్వాల్ కేప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ వస్తోంది ఈ టోర్నమెంట్‌లో. సగం టోర్నమెంట్ పూర్తయినా అదే పరిస్థిిని ఎదుర్కొంటోంది. తొమ్మిది మ్యాచ్‌లను ఆడిన తరువాత కూడా వరుసగా రెండింట్లో విజయం సాధించలేదు. ఒక గెలుపు, ఒక ఓటమి తరహాలో సాగుతోంది. వరుసగా రెండు ఓటములను నమోదు చేసిందే గానీ.. రెండు విజయాలను అందుకోవట్లేదు. సన్‌రైజర్స్, ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడిన తరువాత చెన్నైపై విజయం సాధించింది. మళ్లీ లక్నో చేతిలో ఓడింది. గుజరాత్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నా..
శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, భానుక రాజపక్స.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ బాగున్నప్పటికీ.. ఆడుతున్నది మాత్రం ఒకరిద్దరే. లక్నోపై మరీ ఘోరంగా ఓడింది. ఆ జట్టు నిర్దేశించిన 153 పరుగులను కూడా ఛేదించలేకపోయింది.
మయాంక్ అగర్వాల్-25, జానీ బెయిర్‌స్టో-32, లివింగ్‌స్టొన్-18 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. శిఖర్ ధవన్ లివింగ్‌స్టోన్, బెయిర్‌స్టో, భానుక రాజపక్స నిలకడగా ఆడట్లేదు. రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్ వంటి బౌలర్లు ఉన్న గుజరాత్‌తో వీళ్లు ఎలా తలపడతారనేది ఆసక్తికరం.

టాప్ ప్లేస్‌లో గుజరాత్
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తొమ్మిది మ్యాచ్‌ల్లలో ఒక్కటి మాత్రమే ఓడిందీ టీమ్. ఓపెనింగ్ టు లోయర్ ఆర్డర్ దుమ్ములేపుతోంది. మిడిల్ ఆర్డర్‌లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా పాతుకునిపోతున్నారు.
లోయర్ ఆర్డర్‌లోరషీద్ ఖాన్ ఇప్పటికే తానేమిటో నిరూపించుకున్నాడు. ఓటమి ఖాయమనుకున్న రెండు మ్యాచ్‌లను గెలిపించి చూపించాడు. చివరి ఓవర్‌లో సిక్సర్ల మీద సిక్సర్లు బాదాడీ ఆప్ఘని ఆల్‌రౌండర్. ఇలాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న గుజరాత్‌తో పంజాబ్ బౌలర్లు రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ పోరు ఈ సాయంత్రం చూడొచ్చు.

తుదిజట్టు కూర్పు ఇలా..
పంజాబ్ కింగ్స్ తుదిజట్టులో- శిఖర్ ధవన్, మయాంక్ అగర్వాల్ (కేప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధవన్, కగిసొ రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌లో- శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కేప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యష్ దయాళ్/ప్రదీప్ సంగ్వాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications
