ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో అభిమానులకు వింత అనుభవం ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు పవర్ కట్ సమస్యగా మారింది. పవర్ లేక తొలి రెండు ఓవర్లలో డీఆర్ఎస్ అందుబాటులో లేకుండా పోయింది. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా నష్టపోయింది. రెండు ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
డానియల్ సామ్స్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ రెండో బంతికే డేవాన్ కాన్వే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. స్టేడియంలో పవర్ కట్ కారణంగా డీఆర్ఎస్ కోరుకునే అవకాశం లేకుండా పోయింది. నాన్ స్ట్రైకర్ రుతురాజ్ దీనిపై అంపైర్లతో మాట్లాడిన ఫలితం లేకపోయింది. అయితే బంతి లెగ్ సెడ్ వెళ్లినట్లు అనిపించింది. అయితే అంపైర్ ఔటివ్వడంపై కాన్వే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నాలుగో బంతికి మోయిన్ అలీ(0) క్యాచ్ ఔటవ్వగా.. రెండో ఓవర్ నాలుగో బంతికి రాబిన్ ఊతప్ప సైతం వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికీ కరెంట్ రాకపోవడంతో డీఆర్ఎస్ కోరుకునే అవకాశం లేకపోయింది. దాంతో ఊతప్ప(1) నిరాశగా పెవిలియన్ చేరాడు.
ఇక వరల్డ్ బెస్ట్ లీగ్‌కు పవర్ కట్ సమస్యగా మారడటంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలాంటి లీగ్‌లో పవర్ కట్ అవ్వడం సిగ్గు చేటని, కోట్ల డబ్బులున్న బీసీసీఐ ఈ విషయంలో సిగ్గుపడాలని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది. యావత్ ప్రపంచం ముందు భారత్ పరువు తీసారని బీసీసీఐపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలే కాదు బీసీసీఐ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌ను లైట్ తీసుకుందని సెటైర్లు పేల్చుతున్నారు.
డానియల్ సామ్స్(3/16), కుమార్ కార్తీకేయ(2/22), రిలే మెరెడిత్(2/27) బంతితో చెలరేగడంతో చెన్నై 16 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. మహేంద్ర సింగ్(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్) ఒంటరి పోరాటం చేయడంతో చెన్నై పరువు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలో చెన్నైకి ఇది రెండో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం.