న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) అభిమానులకు చేదు వార్త. ఆ జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకున్నట్లు తెలుస్తోంది. టీమ్ భవిష్యత్తు దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా ఐపీఎల్ 2022 సీజన్లో జట్టును నడిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక ఐపీఎల్ 2022 సీజనే ధోనీ కెరీర్లో చివరి ఐపీఎల్ లీగ్ కానుంది. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్లోనే ధోనీ.. ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగింది. అయితే సొంత అభిమానుల మధ్య సొంత మైదానంలో వీడ్కోలు తీసుకోవాలని భావించిన ధోనీ.. ఆ నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసాడు.
ఇక ధోనీ సూచనలతోనే తొలి ప్రాధాన్య ఆటగాడిగా రవీంద్ర జడేజాను రూ.16 కోట్లకు రిటైన్ చేసుకున్న సీఎస్కే.. మహీని మాత్రం రూ.12 కోట్లకే తీసుకుంది. మొయిన్ అలీని రూ.8 కోట్లకు తీసుకున్న ఆ జట్టు.. గత సీజన్ హీరో రుతురాజ్ గైక్వాడ్‌ను రూ.6 కోట్లకు అంటిపెట్టుకుంది. అయితే టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే రిటెన్షన్ ప్రక్రియను ముగించిన సీఎస్కే ఇప్పుడు కెప్టెన్‌ను కూడా సిద్దం చేసేందుకు రెడీ అయింది. ధోనీ పర్యవేక్షణలోనే రవీంద్ర జడేజాను సారథిగా సిద్దం చేయాలని ఆ జట్టు భావిస్తోంది. టీమ్ భవిష్యత్తుకు ఈ సీజన్‌తోనే గట్టి పునాది వేయాలని ధోనీతో పాటు ఆ ఫ్రాంచైజీ పెద్దలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్లో కేవలం ఆటగాడిగానే కొనసాగనున్నాడు. ఈ నిర్ణయంపై సీఎస్కే అధికారిక ప్రకటన చేయకపోయినా.. టీమ్ వర్గాలు మాత్రం లీక్స్ ఇస్తున్నాయి. ఇది కూడా ధోనీ సూచలనలతోనే తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. ఇక సీజన్ మధ్యలోనే ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మెరుగ్గా రాణిస్తేనే సీజన్ మొత్తం కొనసాగాలని ధోనీ భావిస్తున్నాడట. లేకుంటే మధ్యలోనే గుడ్ బై చెప్పి మెంటార్‌గా జట్టుతోనూ ఉండాలని నిర్ణయించుకునట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని ఫ్రాంచైజీ పెద్దలకు తెలియజేశాడట. అయితే ఈ నిర్ణయం ధోనీ అభిమానులకు మింగుడుపడటం లేదు. కెప్టెన్ ధోనీ లేని సీఎస్కేను ఊహించుకోవడం కష్టంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.
కొత్తగా రెండు జట్ల చేరికతో వచ్చే ఏడాది 10 జట్లతో ఐపీఎల్ అలరించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగించిన బీసీసీఐ.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించనుంది. ఇక అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి చివరి వారంలోనే భారత్ వేదికగా ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే మాత్రం.. లీగ్ శ్రీలంక లేదా సౌతాఫ్రికా తరలిపోయే అవకాశం ఉంది.