
భారీ భాగస్వామ్యాల్లేవ్..
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో కాక మీదున్న ఓపెనర్ జోస్ బట్లర్ మరోసారి భారీ స్కోర్ చేశాడు. 52 బంతుల్లో 67 పరుగులు చేశాడు. టీమ్ మొత్తానికీ అతనే టాప్ స్కోరర్. ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేదు. దేవ్‌దత్ పడిక్కల్ 15, సంజు శాంసన్ 16, మిఛెల్ 17, రియాన్ పరాగ్ 6 పరుగులు చేశారు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్.. తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేయడం కొంత ఊరట. భారీ భాగస్వామ్యాలను ఏర్పడకుండా చేయడంలో ముంబై బౌలర్లు విజయం సాధించారు.

కట్టి పడేసిన బౌలర్లు..
బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు బ్రేకులు వేసింది. బ్యాటర్లెవరినీ కుదురుకోనివ్వలేదు బౌలర్లు. ఎప్పటికప్పుడు వికెట్లు నేల కూల్చారు. ఫలితంగా భారీ భాగస్వామ్యం అనేది ఎక్కడా ఏర్పడలేదు. హృతిక్ షోకీన్, రిలె మెరెడిత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. డేనియల్ సామ్స్, కుమార్ కార్తికేయ తలా ఓ వికెట్ తీసుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా ఎప్పట్లాగే వికెట్ లెస్‌గా ఉండిపోయాడు. కుమార్ కార్తికేయ పొదుపుగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి సంజు శాంసన్ వికెట్ పడగొట్టాడు.

ఆ ఇద్దరూ..
ప్రత్యేకించి- కుమార్ కార్తికేయ, హృతిక్ షోకీన్ బౌలింగ్ ఆకట్టుకుంది. ఓపెనర్లిద్దరినీ షోకీన్ పెవిలియన్ దారి పట్టించాడు. టాప్ గేర్‌లో ఆడుతున్న జోస్ బట్లర్‌ను అవుట్ చేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వైడ్ యాంగిల్‌లో ఊరిస్తూ సంధించిన బంతిని షాట్ ఆడబోయి లాంగ్ ఆఫ్‌లో సూర్యకుమార్ యాదవ్ చేతికి చిక్కాడు బట్లర్. అంతకుముందు అతని బౌలింగ్‌లో కొన్ని భారీ షాట్లు ఆడినా.. ఈ ఉచ్చు నుంచి తప్పించుకోలేకపోయాడు. మరో బౌలర్ కుమార్ కార్తికేయ పొదుపుగా బౌలింగ్ చేశాడు.

భారం మోసిన బ్యాటర్లు..
బౌలర్లు తమ పని పూర్తి చేయడంతో మిగిలిన భారాన్ని బ్యాటర్లు మోశారు. కేప్టెన్ రోహిత్ శర్మ రెండు పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. వెనుకంజ వేయలేదు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ద్వయం మరోసారి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51, హైదరాబాదీ తిలక్ వర్మ 30 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 35 పరుగులు చేశారు.

రోహిత్ కేప్టెన్సీ..
చివర్లో టిమ్ డేవిడ్ దూకుడుగా ఆడాడు. తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే జట్టు విజయాన్ని అందుకుంది. బౌలర్లను ప్రయోగించడంలో రోహిత్ శర్మ తన కేప్టెన్సీ అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. భారీ షాట్లు ఆడినప్పటికీ.. జోస్ బట్లర్‌పై పదే పదే హృతిక్ షోకీన్‌ను సంధించడం సఫలమైంది. గాయపడ్డ అర్షద్ ఖాన్ స్థానంలో ముంబై ఇండియన్స్ కుమార్ కార్తికేయను తీసుకుంది. అతన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగాడు రోహిత్.


Click it and Unblock the Notifications

