ముంబైని గెలిచిన జట్లివే..
బుధవారం రాత్రి పుణెలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది ముంబై. ఈ సీజన్‌లో ఈ టీమ్‌కు ఇది వరుసగా అయిదో ఓటమి. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ చేతిలో ఓడింది. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, ఆ తరువాత కోల్‌కత నైట్‌రైడర్స్‌ను ఎదుర్కొనలేకపోయింది. నాలుగో మ్యాచ్‌లో ఇదే పరిస్థితి. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ అవలీలగా అందుకుంది. అయిదో మ్యాచ్‌లో పంజాబ్ ఇచ్చిన టార్గెట్‌ను ఛేదించలేకపోయింది.
టాప్, మిడిలార్డర్ నిలదొక్కుకున్నా..
ముంబై ఇండియన్స్ ఓపెనర్లు ఘోరంగా విఫలం అయ్యారు. ఆ తరువాత టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఇన్నింగ్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. 32 పరుగుల వద్ద రెండు వికెట్లను కోల్పోయిన తరువాత 84 పరుగుల భాగస్వామ్యం ఏర్పడింది. ఆరు ఓవర్లలోనే ఈ స్కోర్‌ను సాధించారు టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు. 116 పరుగుల వద్ద డెవాల్డ్ బ్రెవిస్ అవుట్ అయిన తరువాత కూడా దూకుడు కొనసాగినప్పటికీ.. కీలక సమయంలో వికెట్లను కోల్పోయింది ముంబై. పరాజయాన్ని కొని తెచ్చుకుంది.
ఫలించని ఆ ముగ్గురి ఫైట్
డెవాల్డ్ బ్రెవిస్ 25 బంతుల్లో 49, తిలక్ వర్మ 20 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 36, సూర్యకుమార్ యాదవ్ 30 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 43 చేసిన పరుగులు చేశారు గానీ అది సరిపోలేదు. రెండు ఓవర్లల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో ఎక్స్‌ప్లోజివ్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్‌లో ఉండటం వల్ల కొద్దో, గొప్పో ఆశలు కనిపించాయి. అతను ఇంకొద్దిసేపు క్రీజ్‌లో ఉండి ఉన్నా.. టైట్ ఫైట్ కొనసాగేది.
సూర్య అవుట్‌తో..
జట్టు స్కోరు 177 పరుగుల వద్ద ఉన్నప్పుడు 18.4 ఓవర్‌లో కగిసొ రబడ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో- గెలుపుపై ముంబై ఆశలు అడుగంటాయి. మోకాలి ఎత్తులో మిడిల్ స్టంప్ మీదికి దూసుకొచ్చిన ఫుల్‌టాస్ బంతిని భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అది కాస్తా ఒడియన్ స్మిత్ చేతుల్లో వాలింది. ఇక విజయంపై అప్పటిదాకా ఉన్న ఆశలను పూర్తిగా వదిలేసుకుంది ముంబై ఇండియన్స్.

నిరాశలో ఆకాశ్ అంబానీ..
అప్పటిదాకా ఉత్కంఠ భరితంగా కనిపిస్తూ వచ్చిన ఫ్రాంఛైజీ బాక్స్.. ఒక్కసారిగా నిరాశతో నిండిపోయింది. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తరువాత ముంబై ఇండియన్స్ ఓనర్ ఆకాశ్ అంబానీ ఇచ్చిన రియాక్షన్.. టీమ్ ఓటమిని ఖరారు చేసింది. మ్యాచ్ చేజారిందనే ఆవేదన అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. వరుసగా అయిదో మ్యాచ్‌లో ఓటమి ఖాయం కావడంతో అక్కడే ఉన్న మిగిలిన అంబానీ ఫ్యామిలీ మెంబర్స్.. నిరాశలో కూరుకుపోయారు.


Click it and Unblock the Notifications












