
పంజాబ్ ఆల్‌రౌండర్ టాలెంట్..
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ టాలెంట్‌ను ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. ప్రత్యర్థికి 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బౌలర్లు ప్రతాపం చూపారు. మిడిల్ ఆర్డర్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ల ఎదురుదాడికి గురైనప్పటికీ.. నిలదొక్కుకోగలిగారు. సకాలంలో వికెట్లను పడగొట్టగలిగారు. డెత్ ఓవర్లల్లో ఒత్తిళ్లలోకి నెట్టగలిగారు. కీలక సమయాల్లో వికెట్లను తీసుకోవడం ద్వారా ముంబైని నియంత్రించగలిగారు.

ఫీల్డింగ్‌లో గ్రేట్..
అటు ఫీల్డింగ్ విషయంలోనూ పంజాబ్ ప్లేయర్లు అద్భుతం అనిపించుకున్నారు. గ్రౌండ్‌లో పాదరసంలా కదిలారు. రనౌట్ల ద్వారా ఇద్దరు కీలక ప్లేయర్లను పెవిలియన్ పంపించగలిగారంటే- ఫీల్డింగ్ నాణ్యత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 20 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 36 పరుగులు చేసి, దూకుడుగా ఉన్న హైదరాబాదీ తిలక్ వర్మను రనౌట్ ద్వారా పెవిలియన్ పంపించారు. మయాంక్ అగర్వాల్- బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ మధ్య కో ఆర్డినేషన్ సూపర్‌గా కనిపించింది.

పొల్లార్డ్ సైతం..
కీరన్ పొల్లార్డ్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. తొలి రన్ తీసే సమయంలో పొల్లార్డ్ కాస్త వేగంగా పరుగెత్తి ఉంటే రెండో రన్ ఈజీ అయ్యేది. అలా జరగలేదు. జాగింగ్ చేసినట్లు తొలి రన్ తీసిన పొల్లార్డ్.. రెండో రన్ కోసం అదే వేగంతో పరుగెత్తాడు. ఉపయోగం లేకుండా పోయింది. అతను క్రీజ్‌లోకి చేరుకునే లోపే- ఒడియన్ స్మిత్ అందించిన బంతితో వికెట్ కీపర్ జితేష్ శర్మ స్టంప్స్‌ను గిరాటేసేశాడు. దీనితో సడన్‌గా ముంబై ఇండియన్స్ ఇన్నింగ్‌కు బ్రేక్ పడింది.

చివరి ఓవర్‌లో..
చివరి ఓవర్‌ను ఒడియన్ స్మిత్ అద్భుతంగా సంధించాడు. ఆరు బంతుల్లో 22 పరుగులు చేయాల్సి దశ అది. పించ్ హిట్టర్లెవరూ క్రీజ్‌లో లేకపోవడంతో అప్పటికే పంజాబ్ కింగ్స్ విజయం ఖరారైంది. ఆ ఓవర్ తొలి బంతిని జయదేవ్ ఉనద్కత్ సిక్స్‌గా మలిచాడు. రెండో బంతికి రెండు పరుగులొచ్చాయి. మూడో బంతికి ఉనద్కత్ అవుట్. నాలుగో బంతి వైడ్‌గా వెళ్లగా.. ఆ ఎక్స్‌ట్రా బాల్.. జస్‌ప్రీత్ బుమ్రాను బలి తీసుకుంది. అయిదో బంతికి పరుగులేమీ రాలేదు. చివరి బంతికి టైమల్ మిల్స్‌ను అవుట్ చేశాడు స్మిత్. దీనితో అతని ఖాతాలో నాలుగు వికెట్లు పడ్డాయి.


Click it and Unblock the Notifications












