
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఇవ్వాళ ముంబై ఇండియన్స్.. తన అయిదో మ్యాచ్‌ను ఆడబోతోంది. పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లల్లో ఓటమి పొందిన రోహిత్ సేన.. గెలుపు కోసం ముఖం వాచిపోయి ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది ముంబై టీమ్. ఈ మ్యాచ్‌లోనైనా జయకేతనాన్ని ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. ఈ కల ఎంతవరకు నెరవేరుతుందనేది ఈ రాత్రికి స్పష్టమౌతుంది.
పంజాబ్ కింగ్స్ పరిస్థితి దీనికి భిన్నం. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లలో రెండింట్లో విజయం సాధించింది. ఒక గెలుపు- ఒక ఓటమి అనే సీక్వెన్స్‌లో కొనసాగుతోందా జట్టు ప్రస్థానం. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ చేతుల్లో ఓడింది. మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చింది పంజాబ్. నాలుగో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఆ సీక్వెన్స్ ప్రకారం చూసుకుంటే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ గెలవాల్సి ఉంటుంది. అదే జరిగితే- ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో ఓటమి తప్పకపోవచ్చు. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఓ అరుదైన రికార్డును అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని సాధించడానికి అతని కావాల్సింది 24 పరుగులే. ఈ మాత్రం స్కోర్ చేస్తే- సురేష్ రైనా పేరు మీద ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డును ఈ లెఫ్ట్ హ్యాండర్ డాషింగ్ ఓపెనర్ బ్రేక్ చేసినట్టవుతుంది. అదే- ముంబై ఇండియన్స్‌పై వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ రికార్డ్. ప్రస్తుతం ఈ ఘనతను సాధించిన ఆటగాడు.. సురేష్ రైనా. ముంబై 34 మ్యాచ్‌లల్లో సురేష్ రైనా 824 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ 26 ఐపీఎల్ ఇన్నింగుల్లో ముంబై ఇండియన్స్‌పై 801 పరుగులు చేశాడు. ఆ కొసరు 24 చేసేస్తే- రైనా రికార్డ్ తెరమరుగవుతుంది.
మరో ఐపీఎల్ రికార్డు కూడా శిఖర్ ధవన్‌ను ఊరిస్తోంది. ఇంకో 89 పరుగులు చేయగలిగితే- ఐపీఎల్ టోర్నమెంట్లల్లో 6,000 పరుగుల క్లబ్‌లో జాయిన్ అవుతాడు. విరాట్ కోహ్లీకి మరింత చేరువ అవుతాడు. విరాట్ కోహ్లీ 203 ఇన్నింగుల్లో 6,389 పరుగులు చేశాడు. 6,000 పరుగుల మైలురాయికి శిఖర్ ధవన్ చాలా దగ్గరగా ఉన్నందున ఈ సీజన్‌లోనే ఆ లాంఛనం కూడా పూర్తి అవుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఈ సీజన్‌లో శిఖర్ ధవన్ ఓ మోస్తరుగా రాణిస్తున్నాడంతే. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో 106 పరుగులు చేశాడు. అతని వ్యక్తిగత అత్యధిక పరుగులు..43.