
40 ఏళ్ల వయస్సుల..ఒంటిచేత్తో..
ఈ మ్యాచ్‌లో ధోనీ ఎలా ఆడాడో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. గేమ్ ఛేంజర్‌గా, బెస్ట్ ఫినిషర్‌గా తనకున్న పేరును నిలబెట్టుకున్నాడు. తన సత్తా ఏమిటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. 40 సంవత్సరాల వయస్సు వచ్చినా.. క్రికెటింగ్ షాట్లల్లో ఎలాంటి తేడా లేదని నిరూపించుకున్నాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అతని ఫినిషింగ్ ఎలా ఉంటుందో.. ఇప్పుడూ అదే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడీ జార్ఖండ్ డైనమేట్. కాలం మారినా ప్రత్యర్థిపై విసిరే చివరి పంచ్ తేడా లేదని నిరూపించాడు. ఇప్పటికీ తానే బెస్ట్ ఫినిషర్‌నని గుర్తు చేశాడు.

ధోనీ మార్క్ పంచ్..
19వ ఓవర్ వరకు ముంబై ఇండియన్స్ చేతుల్లోనే కనిపించింది మ్యాచ్. చిట్టచివరి ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తలరాతను మార్చేశాడు ఫ్యాన్స్ డెమి గాడ్ ధోనీ. 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన దశ అది. క్రీజ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఉండటంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆశలు సడల్లేదు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ధోనీ వమ్ము చేయలేదు. ఆ ఓవర్ తొలి బంతికి వికెట్ పడగొట్టినప్పటికీ.. తొణకలేదు, బెణకలేదు. విజయానికి కావాల్సిన పరుగులను రాబట్టుకున్నాడు ధోనీ. అతణ్ని కట్టడి చేయలేకపోయాడు జయదేవ్ ఉనద్కత్. చివరి నాలుగు బంతుల్లో ధోనీ 6,4,2,4 పరుగులు సాధించడంతో ముంబై పరాజయం పరిపూర్ణమైంది.

ప్రిటోరియస్‌తో కోఆర్డినేషన్..
ధోనీ బ్యాటింగ్ ఒక ఎత్తయితే- నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న డ్వైన్ ప్రిటోరియస్‌తో కోఆర్డినేట్ చేసుకోవడం మరో ఎత్తు. అతని వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు ధోనీ. ఒకదశలో అతని దూకుడునూ అడ్డుకున్నాడు. వెంటవెంటనే భారీ షాట్లు ఆడకుండా నిలువరించాడు. కీలకమైన 19వ ఓవర్‌ను జస్‌ప్రీత్ బుమ్రా వేశాడు. ఆ ఓవర్‌లో ప్రిటోరియస్ ఎక్కువ సేపు స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్నాడు. ధోనీతో కలిసి 11 పరుగులను రాబట్టుకున్నాడు. దీనితో ఈక్వేషన్స్ మరింత తగ్గాయి.

చివరి బంతికీ ఫోర్ కోసం ప్రయత్నించినా..
బుమ్రా వేసిన 19 ఓవర్‌లో ప్రిటోరియస్ రెండు ఫోర్లు బాదాడు. 2, 5 బంతులను ఫోర్లుగా మలిచాడు. చివరి బంతిని కూడా స్కూప్ షాట్ ద్వారా ఫోర్ కొట్టాలని భావించాడు. అదే విషయాన్ని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న ధోనీతో పంచుకున్నాడు. అతను దీనికి అంగీకరించలేదు. బుమ్రా బౌలింగ్‌లోని వైవిధ్యం తెలిసినవాడు కావడంతో అతను ఎలాంటి బంతిని వేస్తాడో వివరించాడు. ధోనీ అంచనాలకు తగ్గట్టే ఆ ఓవర్ చివరి బంతిని బుమ్రా 141 కిలోమీటర్ల వేగంతో ఆఫ్ స్టంప్ మీదికి సంధించాడు. ప్రిటోరియస్ సింగిల్ తీశాడు. ఈ విషయాన్ని డ్వైన్ ప్రిటోరియస్ స్వయంగా వెల్లడించాడు. 19వ చివరి బంతిని తొందరపడి షాట్‌గా ఆడి అవుట్ అయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవోనని చెప్పాడు.


Click it and Unblock the Notifications
