ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ చివరిదశలో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని అందుకుంది. వాంఖెడె స్టేడియంలో గురువారం రాత్రి నాటి మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. అయిదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ గెలుపు- ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు ఎలాంటి హెల్ప్ చేయదు గానీ.. చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలను మాత్రం దెబ్బకొట్టింది. కాస్తో, కూస్తో ఉన్న చెన్నై ప్లేఆఫ్స్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ రెండు జట్లు కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించనున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 16 ఓవర్లల్లో 97 పరుగులకే ఆలౌట్ కాగా.. అయిదు వికెట్లను కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ సేన. లక్ష్యం చిన్నదే అయినా ముంబై ఇండియన్స్ బ్యాటర్ల కూడా తడబడ్డారు. 14.5 ఓవర్ల వరకూ మ్యాచ్‌ను తీసుకెళ్లారు. 33 పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది ముంబై. ఈ దశలో హైదరాబాదీ తిలక్ వర్మ క్రీజ్‌లో పాతుకుపోయాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లతో 34 పరుగులు చేశాడు.
ఇషాన్ కిషన్-6, రోహిత్ శర్మ-18, డేనియల్ సామ్స్-1, ట్రిస్టన్ స్టబ్స్-0, హృతిక్ షోకీన్-18, టిమ్ డేవిడ్ 16 పరుగులతో రాణించారు. మ్యాచ్ గెలవడం పట్ల రోహిత్ శర్మ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తమ జట్టులో కుర్రాళ్లు సత్తా చాటుతున్నారని పేర్కొన్నాడు. ప్రత్యేకించి హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. అన్ని ఫార్మట్లలోనూ ఆడగలిగే సత్తా అతనికి ఉందని కితాబిచ్చాడు. టీమిండియాకు సెలెక్ట్ అయ్యే రోజులు ఎంతో దూరంలో లేవనీ చెప్పాడు.
టెక్నిక్, టెంపర్.. అన్నీ కలిసి ఉన్నాయని, టీమిండియా భవిష్యత్ ఆశాకిరణంలా మారాడనీ వ్యాఖ్యానించాడు. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీలో తిలక్ వర్మ సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాడని అన్నాడు. తిలక్ వర్మ త్వరలోనే వన్డే ఇంటర్నేషనల్స్, టెస్టులు, టీ20 మ్యాచ్‌లల్లో టీమిండియా తరఫున ఆడటాన్ని మనం త్వరలోనే చూస్తామనీ రోహిత్ శర్మ జోస్యం చెప్పాడు. పలువురు యంగ్ క్రికెటర్లకు ఐపీఎల్ ఉజ్వల భవిష్యత్తును ఇచ్చిందని పేర్కొన్నాడు.
ఈ సీజన్లో కొన్ని అనివార్య పరిస్థితుల మధ్య ప్లేఆఫ్స్ చేరలేకపోతున్నామని, లోపాలు ఎక్కడ చోటు చేసుకున్నాయనే విషయంపై పోస్ట్‌మార్టమ్ చేస్తామని రోహిత్ శర్మ హామీ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ అభిమానులను నిరాశపర్చబోదని స్పష్టం చేశాడు. లోపాలపై ఇప్పటి నుంచే ఓ కన్నేసి ఉంచుతామని, వాటన్నింటినీ సంస్కరిస్తామని చెప్పాడు. తామింకా రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉందని, విజయంతో నిష్క్రమిస్తామని అన్నాడు.