
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను మరింత జనరంజకరగా మార్చే ఉద్దేశంతో రెండు కొత్త జట్లను చేర్చాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే 15వ సీజన్‌లో మొత్తంగా 10 జట్లు ఆడనున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో రెండు కొత్త జట్లకు సంబంధించి టెండర్లను బీసీసీఐ పిలవాలనుకున్నా.. వివాద కారణాల వల్ల కాస్త ఆలస్యం అయింది. చివరకు ఈరోజు బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. దాదాపు 10కి పైగా కార్పొరేట్ సంస్థలు రెండు జట్ల కోసం బిడ్లను సమర్పించాయని తెలుస్తోంది. దుబాయ్‌లోని తాజ్ దుబాయ్‌లో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది.
అయితే అహ్మదాబాద్‌ను అదానీ గ్రూప్, లక్నోని మాంచెస్టర్ యునైటెడ్ కైవసం చేసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుందట. ఇక అన్ని పార్టీలు రెండు ఎన్వలప్‌లను సమర్పించవలసిందిగా బీసీసీఐ కోరిందట. ఇందులో ఒక ఎన్వలప్ వ్యక్తిగత, రెండోది ఆర్థికమైన ఆధారాల కోసమని సమాచారం తెలుస్తోంది. బీసీసీఐ దాని చట్టపరమైన, ఆడిట్ అధికారులు తొలుత ఆధారాలను తనిఖీ చేస్తారని, అవి సక్రమంగా ఉంటేనే బిడ్‌తో కూడిన రెండవ కవరు తెరవనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అదానీ గ్రూప్, మాంచెస్టర్ యునైటెడ్ ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తిచేసినట్టు సమాచారం.
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లను బీసీసీఐ ఈరోజు సాయంత్రం వరకు ప్రకటించనుంది. దీంతో 2022 ఐపీఎల్‌లో మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. ఐపీఎల్‌లో 10 జట్లు ఉండటం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2011లో ఐపీఎల్ మూడవ సీజన్‌లో 10 జట్లు ఆడాయి. ఆ సమయంలో కొచ్చి టస్కర్స్ కేరళ, పూణే వారియర్స్ ఫ్రాంచైజీలు ఐపీఎల్‌లో ఆడాయి. ఈసారి కొత్త టీమ్‌లు ఏ నగరానికి చెందినవి, వాటి యజమాని ఎవరు అనేది తేలనుంది. ఐపీఎల్ 15వ సీజన్‌లో మొత్తం 74 మ్యాచులు జరగనుండగా.. బీసీసీఐకి 5000-7000 కోట్లు ఆదాయం దక్కనుందని సమాచారం.
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ కొత్త ఐపీఎల్ జట్టు రేస్‌లో ముందునుంచి ప్రధానంగా ఉంది. ఐపీఎల్‌లో జట్టును సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షను అదానీ గతంలో బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్‌లో ఉండడం.. ఆ నగరం ప్రధాన కేంద్రంగా ఉన్న అదానీ గ్రూప్‌నకు కలిసి రానుంది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ, ఖరీదైన ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ కూడా ఐపీఎల్ జట్టు కొనేందుకు ఎప్పటినుంచో ఆసక్తి చూపిస్తోంది. మాంచెస్టర్ యునైటెడ్ గ్లేజర్ కుటుంబానికి చెందినది. అవ్రామ్ గ్లేజర్ మరియు జోయెల్ గ్లేజర్ మాంచెస్టర్ యునైటెడ్ యజమానులు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ప్రస్తుతం ఈ క్లబ్ తరఫునే ఆడుతున్నాడు.